Sanathnagar News : రూపాయికే నాలుగు సిలిండర్లు, విద్య, వైద్యం- సనత్ నగర్ అభ్యర్థి వినూత్న ప్రచారం
Sanathnagar News : తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు వినూత్న ప్రచారాలు చేస్తున్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానంటూ వినూత్న ప్రచారం చేస్తు్న్నారు.
Sanathnagar News : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయమే లక్ష్యం ప్రధాన పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి. హామీలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికారం కోసం ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల మేనిఫెస్టో కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. ఎవరికి తోచిన హామీలను వారు ఇస్తుంటారు. అందులో అన్నీ అమలు చెయ్యొచ్చు చేయలేకపోవచ్చు. అయితే అందరిలా కాకుండా ఎన్నికల బరిలో నిలిచిన ఓ అభ్యర్థి వినూత్న హామీనిచ్చి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు.
రూపాయికే విద్య, వైద్యం, ఏడాదికి నాలుగు సిలిండర్లు
ఎన్నికలో తనను గెలిపిస్తే విద్య, వైద్యం సహా అన్ని రూపాయికే అందిస్తానని అంటున్నారు సనత్ నగర్ కు చెందిన వెంకటేశ్ యాదవ్. అంతే కాదు ఒక రూపాయికే సంవత్సరానికి నాలుగు సిలిండర్లు కూడా అందిస్తానని హామీనిచ్చారు. వీటితో పాటు ప్రతీ వంద ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమిస్తానని....ఇంట్లో పానిక్ బటన్ నొక్కగానే వాలంటీర్ లు వచ్చి సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఇలా వినూత్నమైన హామీలను ప్రజలకు వివరిస్తూ సనత్ నగర్ నియోజకవర్గం నుంచి వెంకటేష్ యాదవ్ ఎన్నికల బరిలో దిగారు.
సనత్ నగర్ బరిలో
వెంకటేష్ యాదవ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి కోట నీలిమ, బీజేపీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇలా బలమైన అభ్యర్థులపై పోటీకి దిగిన వెంకటేష్ యాదవ్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కొత్త హామీలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా గ్యాస్ సిలిండర్లు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని తద్వారా సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అందుకోసమే సనత్ నగర్ లో ఉండే సామాన్యులకు భారం తగ్గించేలా రూపాయికే నాలుగు సిలిండర్ల ప్రకటన చేసినట్టు వెంకటేష్ యాదవ్ తెలిపారు. ఎన్నికల్లో వినూత్న ప్రచారం కోసమే వెంకటేష్ యాదవ్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని ప్రత్యర్థులు అంటున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్