Shoaib Malik Marriage: పాక్ నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్.. సానియా మీర్జాతో విడాకులు అయ్యాయా!-shoaib malik marries pakistani actress sana javed amid rumours of divorce with sania mirza ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shoaib Malik Marriage: పాక్ నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్.. సానియా మీర్జాతో విడాకులు అయ్యాయా!

Shoaib Malik Marriage: పాక్ నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్.. సానియా మీర్జాతో విడాకులు అయ్యాయా!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 20, 2024 12:49 PM IST

Shoaib Malik Marriage: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. నటి సనా జావేద్‍ను వివాహం చేసుకున్నాడు. భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాతో అతడికి విడాకులయ్యాయని ఇటీవల రూమర్లు వచ్చాయి. ఇంతలోనే మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు.

Shoaib Malik Marriage: పాక్ నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్
Shoaib Malik Marriage: పాక్ నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్

Shoaib Malik Marriage: పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‍ను మాలిక్ పెళ్లాడాడు. భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు, అతడికి విడాకులు అయ్యాయని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏకంగా మరో పెళ్లి చేసుకున్నాడు మాలిక్. సనా జావేద్‍ను తాను వివాహం చేసుకున్నానని మాలిక్ అధికారికంగా ప్రకటించాడు. పెళ్లి ఫొటోలను నేడు (జనవరి 20) ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‍ఫామ్‍లో పోస్ట్ చేశాడు.

మాలిక్, సనా జావేద్ డేటింగ్‍లో ఉన్నారని గతేడాది నుంచి రూమర్లు వినిపిస్తున్నాయి. మాలిక్‍కు ఆమె బడ్డీ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం.. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేయటంతో అవి మరింత బలపడ్డాయి. అలాగే, కొంతకాలంగా మాలిక్, సానియా మీర్జా వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరూ విడిపోయారని రూమర్లు వచ్చాయి. వారు కూడా కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో ఆ దిశగా సంకేతాలు ఇస్తూ పోస్టులు చేశారు. ఇప్పుడు మాలిక్.. మరో వివాహం చేసుకున్నాడు.

విడాకులు అయ్యాయా!

షోయబ్ మాలిక్, సానియా మీర్జా పెళ్లి 2010 ఏప్రిల్‍లో హైదరాబాద్‍లో వైభవంగా జరిగింది. ముస్లిం సంప్రదాయంలో గ్రాండ్‍గా ఇద్దరూ ఒక్కటయ్యారు. హైదరాబాద్‍లో నిఖా.. తర్వాత వలిమా వేడుక పాకిస్థాన్‍లోని సియాల్‍కోట్‍లో జరిగింది. అప్పట్లో వీరి పెళ్లిపై చాలా చర్చలు జరిగాయి. సానియా, మాలిక్‍ దంపతులకు ఇజాన్ అనే కుమారుడు 2018లో జన్మించారు. సానియా వద్దే ఇజాన్ ఉంటున్నారు. సానియా, మాలిక్ మధ్య విభేదాలు ఉన్నట్టు రెండేళ్లుగా పుకార్లు వస్తున్నాయి. అయితే, విడాకుల ప్రక్రియ పూర్తయినట్టు సానియా, మాలిక్‍ల్లో ఎవరూ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇంతలోనే సనా జావెద్‍ను పెళ్లి చేసుకున్నాడు మాలిక్.

మూడు రోజుల కిందటే సానియా ఇలా..

సానియా మీర్జా మూడు రోజుల క్రితమే ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ స్టోరీ పోస్ట్ చేశారు. విడాకులు అంటూ ఆమె దీంట్లో పేర్కొన్నారు. దీంతో మాలిక్‍తో ఆమె విడాకులు తీసుకోవడం ఖాయం అంటూ రూమర్లు మరింత పెరిగాయి.

“పెళ్లి అనేది కష్టం. విడాకులు కష్టం. మీకు కఠినమైనదే ఎంపిక చేసుకోవాలి. ఊభకాయం కష్టం.. ఫిట్‍గా ఉండడం కష్టం. కష్టమైనదే ఎంపిక చేసుకోవాలి” అంటూ సానియా మీర్జా పోస్ట్ చేశారు. ఆర్థిక స్వతంత్రం, కమ్యూనికేషన్ గురించి కూడా కష్టమైనదే ఎంపిక చేసుకోవాలంటూ పేర్కొన్నారు. “జీవితం ఎప్పుడూ సులభం కాదు. ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. కానీ మనం కఠినమైనదాన్నే ఎంపిక చేసుకోవచ్చు. తెలివిగా ఎంపిక చేసుకోండి” అని సానియా మీర్జా పోస్ట్ చేశారు.

2021 నుంచి సానియా మీర్జా, షోయబ్ మాలిక్ మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలిసింది. అయితే, ఆ తర్వాత కూడా ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో కొన్నిసార్లు పోస్ట్ చేశారు. వెకేషన్‍కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసుకున్నారు. అయినా, వేర్వేరుగా ఉండటంతో విడాకుల పుకార్లు పెరిగాయి. అయితే, గతేడాది సానియా, మాలిక్ కలిసి మీర్జా, మాలిక్ షో అంటూ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో మళ్లీ కలిశాం అనేలా సంకేతాలు ఇచ్చారు. అయితే, ఇప్పుడు మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సానియా - మాలిక్ వివాహ బంధం సుమారు 14 ఏళ్ల తర్వాత ముగిసినట్టే అర్థం చేసుకోవచ్చు.

IPL_Entry_Point