Team India: టీ20 వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే కోట్లు సంపాదించిన టీమిండియా క్రికెటర్స్ వీళ్లే!
Team India: టీ20 వరల్డ్ కప్ విన్నర్స్‌గా నిలిచిన టీమిండియా ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. వరల్డ్ కప్ గెలిచిన ఒక్కో ఆటగాడికి 12 కోట్లకుపైనే నగదు బహుమతి దక్కనుంది.
Team India: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసి పదిహేడేళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ టైటిల్ సొంతం చేసుకున్నది. టోర్నీ ఆసాంతం ఒక్క ఓటమి కూడా లేకుండా కప్ గెలిచి చరిత్రను సృష్టించింది రోహిత్ సేన. విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాపై క్రికెట్, రాజకీయ వర్గాలతో పాటు అభిమానులు ప్రశంసలు కురిపిస్తోన్నారు. వరల్డ్ కప్‌లో టీమిండియా పోరాటం అసామాన్యమని, బెస్ట్ టీమ్ ఇదంటూ ఆకాశానికి ఎత్తుతోన్నారు.
కాసుల వర్షం...
వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియా ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. వరల్డ్ కప్ విన్నర్ హోదాలో టీమిండియాకు 20. 42 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. వీటితో పాటు లీగ్, సూపర్ 8 స్టేజీలలో విజయాలకు గాను ఒక్కో మ్యాచ్‌కు 26 లక్షల వరకు ప్రైజ్‌మనీని టీమిండియా సొంతం చేసుకుంది. ఆరు మ్యాచ్‌లకు గాను కోటిన్నరకుపైగానే ప్రైజ్‌మనీ టీమిండియా ఆటగాళ్లకు దక్కింది.
బీసీసీఐ 125 కోట్లు...
అలాగే వరల్డ్ కప్ సాధించిన రోహిత్ సేనకు బీసీసీఐ 125 కోట్ల క్యాష్ ప్రైజ్‌ను ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ విన్నర్ ప్రైజ్‌మనీకి ఆరింతల బహుమతిని బీసీసీఐ అనౌన్స్‌చేసింది.
బీసీసీఐ ప్రకటించిన మొత్తం నుంచి వరల్డ్ కప్‌కు ఎంపికైన పదిహేను మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 8.33 కోట్ల వరకు క్యాష్ ప్రైజ్ దక్కనుంది. అలాగే టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ద్వారా ఒక్కో టీమిండియా ప్లేయర్ కోటిన్నర వరకు అందుకున్నాడు. మ్యాచ్ ఫీజులు రూపంలో ఒక్కో క్రికెటర్ మరో కోటికిపైనే సంపాదించారు. మొత్తంగా వరల్డ్ కప్ ఎంపికైన ఒక్కో క్రికెటర్ 12 కోట్లకుపైనే నగదు బహుమతిని సొంతం చేసుకున్నట్లు సమాచారం.
బెంచ్‌కు పరిమితమైనా...
వరల్డ్ కప్ ఆడిన ఆటగాళ్లకే కాకుండా టోర్నీ మొత్తం బెంచ్‌కు పరిమితమైన సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, చాహల్‌కు కూడా మిగిలిన వారితో సమానంగా 12 కోట్ల వరకు నగదు బహుమతి దక్కనుంది. ఈ వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఈ నలుగురు కోట్లు సంపాదించారు.
చోటు దక్కలేదు...
టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో చాహల్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లకు చోటు దక్కింది. కానీ తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం వీరికి ఒక్క మ్యాచ్‌లో కూడా రాలేదు. జట్టు కూర్పు దెబ్బతింటుందనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి మార్పులు చేయలేదు. శివమ్ దూబే, జడేజా వరుసగా విఫలమైన వారికే ఛాన్స్‌లు ఇచ్చి కొనసాగించడంపై విమర్శలొచ్చాయి. అయినా కూడా వారిని పక్కనపెట్టి సంజూ శాంసన్, చాహల్, జైస్వాల్‌కు అవకాశం ఇవ్వలేదు.