India vs Australia: ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా.. తొలిసారి ఇలా..
India Women vs Australia Women Test Match: ఆస్ట్రేలియాను భారత మహిళల జట్టు చిత్తు చేసింది. ఆ జట్టుతో టెస్టు మ్యాచ్‍లో అదిరే విజయం సాధించింది. వివరాలివే..
India Women vs Australia Women Test Match: టెస్టు క్రికెట్‍లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఇటీవల ఇంగ్లండ్‍ను టెస్టులో చిత్తు చేసిన భారత్.. ఇప్పుడు ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మహిళల టీమ్‍పై అద్భుత విజయం సాధించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై భారత్‍కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‍లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి చరిత్రాత్మక విజయాన్ని సాధించింది భారత్. వివరాలివే..
ఈ టెస్టు మ్యాచ్‍లో చివరిదైన నాలుగో రోజు నేడు (డిసెంబర్ 24) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్ తహ్లియా మెక్‍గ్రాత్ (73) అర్ద శతకంతో రాణించారు. భారత స్టార్ బౌలర్ స్నేహ్ శర్మ నాలుగు వికెట్లతో సత్తాచాటారు. రాజేశ్వరి గైక్వాడ్, హర్మన్‍ప్రీత్ కౌర్ చెరో రెండు వికెట్లు దక్కించుకోగా.. పూజా వస్త్రాకర్ ఓ వికెట్ తీశారు. మొత్తంగా భారత్‍కు 75 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఆసీస్ నిర్దేశించగలిగింది.
సునాయాస లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే 75 రన్స్ చేసి గెలిచింది. ఓపెనర్ స్మృతి మంధాన (38 నాటౌట్) చివరి వరకు నిలిచారు. విన్నింగ్ షాట్ కొట్టారు. షెఫాలీ వర్మ (4) త్వరగానే ఔట్ కాగా.. రిచా ఘోష్ (13), జెమీమా రోడ్రిగ్స్ (12 నాటౌట్) రాణించారు.
ఈ టెస్టు మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్‍ను కూల్చారు. దీప్తి శర్మ (78), జెమీమా రోడ్రిగ్స్ (73), రిచా ఘోష్ (52) అర్ధ శతకాలతో సత్తాచాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగుల స్కోర్ చేసి.. భారీ ఆధిక్యాన్ని భారత్ సాధించింది.
187 పరుగుల వెనుకబాటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 261 పరుగులు చేసింది. దీంతో భారత్‍కు 75 లక్ష్యం వచ్చింది. దీన్ని భారత మహిళల జట్టు అలవోకగా ఛేదించింది.
సంబంధిత కథనం