Electric Car : ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కారుదే అత్యధిక రేంజ్.. ఒక్క ఛార్జ్‌తో 775 కిలో మీటర్లు!
Electric Car Range : ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ సెగ్మెంట్‌లో కంపెనీలు రేంజ్(మైలేజీ) పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇప్పుడు తక్కువ ధర కార్లలో మంచి రేంజ్ వస్తుంది. టాటా మోటార్స్, ఎంజీ మోటార్ ఈ విభాగంలో మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటున్నాయి.
ఎలక్ట్రిక్ కార్ల వాడకం భారతదేశంలో విపరీతంగా పెరుగుతోంది. రోజురోజుకు కస్టమర్లు వీటి వైపు ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు కూడా ఎక్కువ రేంజ్ ఇచ్చేవాటిని తయారు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇప్పుడు తక్కువ ధర కార్లలో కూడా మంచి రేంజ్ వస్తుంది. టాటా మోటార్స్, ఎంజీ మోటార్ లాంటి కంపెనీలు ఈ మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి. అదే సమయంలో టెస్లా, బీవైడీ వంటి కంపెనీలు ప్రపంచ మార్కెట్లో హై రేంజ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. అయితే వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అత్యధిక రేంజ్‌ని ఇచ్చే ఎలక్ట్రిక్ కారు ఈ కంపెనీలకు చెందినది కాదు.
ప్రపంచంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్ బెంజ్ నుండి వచ్చింది. మెర్సిడెస్ బెంజ్ నుండి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు మోడల్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ సెలూన్. ఈక్యూఎస్ 450ప్లస్ ఏఎంజీ లైన్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 775 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. 2021లో యూకేలో ఈక్యూఎస్ 580 4మాటిక్, ఏఎంజీ ఈక్యూఎస్ 53 4మాటిక్ ప్లస్ అనే రెండు వేరియంట్లలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇది కేవలం 4 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ సెలూన్.. ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, డిజిటల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, 3డీ హెలిక్స్ టెయిల్‌లైట్స్ వంటి ఫీచర్లతో ఉంటుంది. ఇందులో 56 అంగుళాల సింగిల్ పీస్ ఎంబీయూఎస్ హైపర్ స్క్రీన్ ను అందించారు. అంతేకాకుండా 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు, పవర్డ్ ఫ్రంట్, రియర్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈక్యూఎస్ 580 4మాటిక్ వేరియంట్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్, 107.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ను పొందుతుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ను కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. సేఫ్టీ కోసం యూరో ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో దీనికి 5 స్టార్ రేటింగ్ ఉంది. దీని ధర సుమారు రూ.1.22 కోట్లు. మరోవైపు, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ భారతదేశంలో అత్యంత రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు. దీని WLTP సర్టిఫైడ్ రేంజ్ 677 కిలోమీటర్లు. డ్యూయల్ మోటార్ సెటప్ తో 107.8 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంది. ఇది 523 బీహెచ్‌పీ పవర్, 855 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.1.55 కోట్ల నుంచి రూ.2.45 కోట్ల వరకు ఉంటుంది.