Toyota SUV : టయోటా నుంచి మూడు ఎస్‌యూవీలు.. ఇందులో ఎలక్ట్రిక్ కారు కూడా
Upcoming Toyota SUV : టయోటా నుంచి మూడు కొత్త ఎస్‌యూవీలు రానున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. అంతేకాదు టయోటా తన పాపులర్ ఎస్‌యూవీ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో 7-సీటర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల్లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. 2024 ప్రథమార్థంలో భారతదేశంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ వాటా 52 శాతంగా ఉందంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, దిగ్గజ కార్ల తయారీ సంస్థ టయోటా తన 3 కొత్త ఎస్‌యూవీ మోడళ్లను వచ్చే సంవత్సరంలో అంటే 2025 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
టయోటా కంపెనీ నుంచి రాబోయే ఎస్‌యూవీలో 7 సీటర్ వేరియంట్లు, ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. టయోటా రాబోయే 3 ఎస్‌యూవీ మోడళ్ల ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
7-సీటర్ టయోటా హైరైడర్
టయోటా తన పాపులర్ ఎస్‌యూవీ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో 7-సీటర్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వార్తా వెబ్సైట్ గాడివాడిలో ప్రచురితమైన ప్రకారం రాబోయే 7-సీట్ల టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వచ్చే ఏడాది అంటే 2025 లో కంపెనీ విడుదల చేయనుంది. టయోటా యొక్క రాబోయే ఎస్‌యూవీ మారుతి గ్రాండ్ విటారా 7-సీటర్ ఆధారంగా ఉంటుంది. కారులో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను పవర్ ట్రెయిన్‌గా ఉపయోగిస్తారు.
టయోటా ఫార్చ్యూనర్ హైబ్రిడ్
కొన్నేళ్లుగా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన పెద్ద ఎస్‌యూవీ ఇది. 2025లో టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కారు 48 వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేసి 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 201బిహెచ్‌పీ పవర్, 500ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
టయోటా ఈవీ
టయోటా తన మొదటి ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టయోటా ఎలక్ట్రిక్ కారు రాబోయే మారుతి సుజుకి ఈవిఎక్స్ ఆధారంగా ఉంటుంది. దీనిని కంపెనీ 2025 ద్వితీయార్థంలో భారత మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఈ కారులో 2 బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్ ఉంటుందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మొదటి 48 కిలోవాట్ల బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు, 60 కిలోవాట్ల బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.