Layoffs in India : ఇండియాలోనూ.. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి!
Layoffs in India : దేశంలో గత కొన్నేళ్లల్లో 36,400 మంది టెక్ ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారు. కొన్ని సంస్థలు.. ఏకంగా 100శాతం సిబ్బందిని తొలగించాయి
Layoffs in India : ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలోను 'ఉద్యోగాల కోత' వార్తలు నిత్యం దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా గత 6,7 నెలలుగా దిగ్గజ కంపెనీల నుంచి సాధారణ సంస్థల వరకు.. కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తీసేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇండియాలో గత కొన్నేళ్ల కాలంలో టెక్ ఉద్యోగాలు కోల్పోయిన వారి డేటాను లేఆఫ్.ఎఫ్‌వైఐ అనే సంస్థ తాజాగా వెల్లడించింది. మొత్తం మీద 36,400మంది కొన్నేళ్ల వ్యవధిలో ఉద్యోగాలు కోల్పోయారు. లిడో లర్నింగ్, సూపర్లర్న్, గోనట్స్తో పాటు మొత్తం మీద 9 కంపెనీలు.. 100శాతం మంది ఉద్యోగులను తొలగించడం గమనార్హం. గోమెకానిక్, ఫబల్కేర్, ఎంఫైన్‌తో పాటు మరో 5 కంపెనీలు.. తమ సిబ్బందిలోని 70-75శాతం మందిని ఇళ్లకు పంపించేశాయి.
ఉద్యోగాలు.. పోతున్నాయి!
ఇండియాలో ఉద్యోగులను భారీ మొత్తంలో తొలగిస్తున్న, తొలగించిన సంస్థల్లో బైజూస్ మొదటి స్థానంలో నిలిచింది! ఇప్పటివరకు 4వేల మంది జాబ్స్‌ను కట్ చేసింది. ఇక 2021 జనవరిలో 1800 మంది ఉద్యోగులను ఇళ్లకు పంపించేసిన వైట్‌హ్యాట్ జూనియర్.. 2022 జూన్‌లో మరో 300మందిని తప్పించింది. జనవరి 21న.. 1800మంది బైట్‌డ్యాన్స్ ఉద్యోగులు.. తమ జాబ్స్ కోల్పోయారు. పైసాబజార్.. 2020లో 1,500 మందిని కట్ చేసింది. అప్పటి వర్క్‌ఫోర్స్‌లో ఇది 50శాతం.
Layoffs in India 2023 : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. 2020 మే నుంచి ఇప్పటివరకు 2,880 ఉద్యోగులకు గుడ్ బై చెప్పింది. 2020 ఏప్రిల్‌లో 800మందిని, 2020 జులైలో 350మందిని, 2022 డిసెంబర్లో మరో 250మందిని, 2023 జనవరిలో 380మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. మరో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ.. 2020 మే నుంచి 650మంది ఎంప్లాయీస్‌ని తప్పించింది. 2020 మేలో 520మంది, 2022 నవంబర్‌లో 100 మందికి ఉద్వాసన పలికింది.
క్యాబ్ సర్వీసెస్ అందించే ఓలా.. 2020 మే నుంచి ఇప్పటివరకు 4 విడతలుగా ఉద్యోగులను తప్పించింది. 2020లో ఏకంగా 1,400 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా.. 2022 జులైలో మరో 1000మందికి గుడ్ బై చెప్పేసింది. 2022 సెప్టెంబర్‌లో 200మందిని, 2023 జనవరిలో మరో 200మందిని తొలగించింది.
అంతర్జాతీయంగా..
India layoffs data 2023 : అంతర్జాతీయంగా ఈ ఏడాదిలో 503 టెక్ కంపెనీలు.. ఏకంగా 1,48,165 మంది ఉద్యోగులను తప్పించాయి. 2022లో 1.6లక్షల మంది జాబ్ కట్స్‌కు గురయ్యారు. అమెజాన్ సంస్థ అత్యధికంగా 25వేల మందిని తప్పించింది. రానున్న కాలంలో ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు!
సంబంధిత కథనం