TCS Q3 Results: టీసీఎస్ మూడో క్వార్టర్ ఫలితాలు వచ్చేశాయి.. లాభం, ఆదాయం అంచనాలను అందుకుందా!
TCS Q3 FY23 Results: 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను టీసీఎస్ సంస్థ ప్రకటించింది. 2022 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో వచ్చిన నికర లాభం, ఆదాయం వివరాలను వెల్లడించింది. డివిడెంట్‍ను కూడా ప్రకటించింది.
TCS Q3 FY23 Results: భారత టెక్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata consultancy Services - TCS).. 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3 FY23) ఫలితాలు వెల్లడయ్యాయి. మూడో క్వార్టర్‌లో నికర లాభం (TCS Profit), ఆదాయం (TCS Revenue) లెక్కలను ఆ సంస్థ సోమవారం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఆదాయం మాత్రం అంచనాలను దాటిపోయింది. టీసీఎస్ 2022-2023 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ రిజల్ట్స్ (TCS Results) వివరాలు ఇవే.
నికర లాభం 11శాతం వృద్ధి
TCS Q3 FY23 Results: 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య మూడో త్రైమాసికం(2023FYQ3)లో రూ.10,846 కోట్ల లాభాన్ని టీసీఎస్ ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికం (రూ.9,806 కోట్లు)తో పోలిస్తే ఇది 10.98 శాతం అధికం. అయితే ఈ వృద్ధి అంచనాల కంటే కాస్త తక్కువగా ఉంది.
ఇక కిందటి త్రైమాసికంతో పోలిస్తే.. టీసీఎస్ లాభం మూడో క్వార్టర్‌లో 4శాతం పెరిగింది.
ఆదాయంలో 19శాతం అప్
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(2023FYQ3) లో TCS సంస్థ.. రూ.58,229 కోట్ల ఆదాయాన్ని గడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 19.11 శాతం ఆదాయ వృద్ధిని టీసీఎస్ కనబరిచింది. కిందటి ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టీసీఎస్ ఆదాయం రూ.48,885గా నమోదైంది. కాగా, FY23 రెండో క్వార్టర్‌తో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ ఆదాయం 5.3 శాతం పెరిగింది.
టీసీఎస్ ఆదాయ వృద్ధి మాత్రం అంచనాలను అందుకుందని చెప్పవచ్చు. అయితే నికర లాభమే కాస్త నిరాశపరిచింది. ఇక మూడో త్రైమాసికంలో టీసీఎస్ ఆర్డర్ బుక్ 7.8 బిలియన్ డాలర్లుగా ఉంది. కిందటి క్వార్టర్‌లో ఇది 8.1 బిలియన్ డాలర్లుగా ఉండేది.
ఒక్కో షేర్‌కు రూ.75 డివిడెండ్
ఒక్కో షేర్‌కు ఇన్వెస్టర్లకు రూ.75 డివిడెండ్‍ను టీసీఎస్ ప్రకటించింది. దీంట్లో రూ.67 ప్రత్యేక డివిడెండ్‍గా ఉంది. డివిడెంట్లకు రికార్డు డేట్ జనవరి 17గా ఉంది.
భారతీయ టెక్ సంస్థల ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి టీసీఎస్ రిజల్ట్స్‌ను సూచికగా భావిస్తారు. ఎందుకంటే అన్ని సంస్థల కంటే టీసీఎస్ ముందుగా ఫలితాలను ప్రకటిస్తుంది. అందులోనూ అతిపెద్ద ఐటీ ఎగుమతిదారుగా టీసీఎస్ ఉంది. ఇక, మూడో త్రైమాసికంలో నికర లాభం ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఉద్యోగుల సంఖ్యను టీసీఎస్ తగ్గించుకుందని తెలుస్తోంది.