Tata Motors share price : నెల రోజుల్లో 12శాతం పతనం- ఈ రోజు 3% డౌన్.. టాటా మోటార్స్ షేర్స్‌కి ఏమైంది?
Tata Motors share price drop : టాటా మోటార్స్ షేర్లలో పతనం కొనసాగుతోంది. గత నెల రోజులగా దాదాపు 12.5శాతం పడిన ఈ స్టాక్, మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 3శాతం డౌన్ అయ్యింది. దీనికి కారణాలేంటి?
టాటా మోటార్స్ షేర్లు గత కొన్నిరోజులుగా పతనమవుతున్నాయి. మరీ ముఖ్యంగా నెల రోజుల వ్యవధిలో టాటా మోటార్స్ స్టాక్ ఏకంగా 12.5శాతం పడింది. ఇక మంగళవారం ఉదయం ట్రేడింగ్ సెషన్లోనూ ఈ సంస్థ షేర్లు దాదాపు 3శాతం క్షీణించాయి. 52 వీక్ హై అయిన రూ. 1,179 నుంచి టాటా మోటార్స్ షేరు ఇప్పుడు రూ. 906 వద్దకు చేరింది. దీనికి ప్రధాన కారణంగా ఇటు దేశీయంగా సంస్థ సేల్స్ తగ్గడం, అటు జేల్ఆర్ అమ్మకాలు కూడా పతనం అవ్వడం!
టాటా మోటార్స్ షేర్లు ఎందుకు పడుతున్నాయి?
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో టాటా మోటార్స్ షేరు ధర బీఎస్ఈలో రూ .918.10 వద్ద ప్రారంభమైంది. ఇది మునుపటి ముగింపు రూ .928.10 తో పోలిస్తే 1% ఎక్కువ. ఆ తర్వాత టాటా మోటార్స్ షేరు ధర రూ.893.90కు పడిపోయింది. అనంతరం కాస్త పుంజుకుంది.
2025 ఆర్థిక సంవత్సరం రెండొవ త్రైమాసికంలో జేఎల్ఆర్ హోల్‌సేల్స్ డేటా 87,303 యూనిట్లుగా నమోదైంది. 2024 ఆర్థిక సంవత్సరం రెండొవ త్రైమాసికంతో పోల్చితే ఇది 10% తక్కువ. సరఫరా పరిమితులే ఈ తగ్గుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రీమియం అల్యూమినియం సరఫరాదారుల నుంచి సరఫరా సమస్యల ఫలితంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఉత్పత్తి 86,000 యూనిట్లకు (7% తగ్గింది) పరిమితమైంది. ఇది అనేక ఒరిజినల్ పరికరాల తయారీదారులను సైతం ప్రభావితం చేసింది.
దాదాపు 6,500 వాహనాలు అడిషనల్ క్వాలిటీ చెక్స్ కారణంగా హోల్డ్‌లో ఉన్నాయి. వీటిల్లో యూకే, యూరోపియన్ ప్రాంతాలకు చెందిన వాహనాలే అధికం.
మరోవైపు, టాటా మోటార్స్ ప్రకారం రెండొవ త్రైమాసికంలో 103,108 యూనిట్ల రిటైల్ అమ్మకాలు (చెర్రీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ చైనా జేవీతో సహా).. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 3% తగ్గాయి.
అయితే అల్యూమినియం సరఫరా పరిస్థితి సాధారణ స్థీతికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఉత్పత్తి, హోల్‌సేల్ వాల్యూమ్స్ మెరుగుపడతాయని, బలంగా పుంజుకుంటాయని జేఎల్ఆర్ అంచనా వేస్తోంది. మొత్తం హోల్‌సేల్స్‌లో అత్యంత లాభదాయకమైన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, డిఫెండర్ మోడళ్ల వాటా 67శాతంగా ఉండటం సానుకూల విషయం.
క్యూ2 అంచనాలు కట్..
జేఎల్ఆర్ క్యూ2 హోల్‌సేల్ వాల్యూమ్స్‌ని దృష్టిలో పెట్టుకుని, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు దాని ఎఫ్వై25 క్యూ2 రెవెన్యూ, ఇంట్రెస్ట్ ట్యాక్స్ డిప్రిసియేషన్కి ముందు ఆదాయం, నెట్ ప్రాఫిట్ అంచనాలను వరుసగా 5.8శాతం, 3.03శాతం, 8.2శాతానికి తగ్గించారు.
కన్సాలిడేటెడ్ రెవెన్యూ, ఎబిటా, నికరలాభం క్యూ2 ఎఫ్వై25 అంచనాలు ప్రస్తుతం సుమారు రూ.96240 కోట్లు, రూ.12950 కోట్లు, రూ.404 కోట్లుగా ఉన్నాయి. ఇవి మునుపటి అంచనాలతో పోలిస్తే వరుసగా 4 శాతం, 2.4 శాతం, 5.3 శాతం తక్కువ.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. డిమాండ్ ఉత్పత్తి, పోర్ట్‌ఫోలియో మిక్స్, ఈవీల తయారీపై దృష్టి పెట్టడం వల్ల పెరుగుతున్న వ్యయ ఒత్తిడి కారణంగా జేఎల్ఆర్ మార్జిన్లు డైల్యూట్ అయ్యే అవకాశం ఉంది.
భారతీయ ఆటో పరిశ్రమ డిమాండ్ తగ్గుముఖం పట్టింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కమర్షియల్ వెహికిల్ సేల్స్‌కు డిమాండ్ కూడా ఓ మోస్తరుగానే ఉంది. తద్వారా ఎంఓఎఫ్ఎస్ఎల్ విశ్లేషకులు.. భారతీయ వ్యాపారానికి ఫ్లాట్ మార్జిన్లను తమ అంచనా కాలానికి (ఎఫ్వై24-26) పరిగణనలోకి తీసుకున్నారు.
(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం