Swiggy IPO : రూ. 3,750 కోట్లతో స్విగ్గీ మెగా ఐపీఓ- అతి త్వరలో లాంచ్!
Swiggy IPO date : రూ. 3,750 కోట్లు విలువ చేసే ఐపీఓ కోసం సెబీ వద్ద డీహెచ్‌ఆర్‌పీ పేపర్స్‌ని స్విగ్గీ ఫైల్ చేసింది. ఫౌండర్స్‌తో పాటు ఇతర కీలక ఇన్వెస్టర్లు తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నారు.
మచ్ అవైటెడ్ స్విగ్గీ ఐపీఓపై కీలక అప్డేట్! ఐపీఓ ద్వారా రూ. 3,750 కోట్లను సమీకరించేందుకు సెబీ వద్ద డీఆర్‌హెచ్‌పీ పేపర్స్‌ని ఫైల్ చేసింది ఈ లీడింగ్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ. ఐపీఓలో భాగంగా దాదాపు 18.5 కోట్ల షేర్లను అన్లోడ్ చేయనుంది.
స్విగ్గీ ఐపీఓలో భాగంగా కంపెనీ ఫౌండర్స్ శ్రీహర్ష- రాహుల్ జమైనిలు వరుసగా 17 లక్షలు- 11 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఎస్సెల్, ప్రోసుస్, మైతువాన్, నార్వెస్ట్ వెంచర్ పార్ట్నర్స్, ఆల్ఫా వేవ వెంచర్స్, కోట్యూ, టెన్సెంట్ క్లౌడ్ వంటి ఎర్లీ ఇన్వెస్టర్స్ కూడా షేర్లను విక్రయించనున్నాయి.
సెబీకి ఫస్ట్ వర్షెన్ డీఆర్‌హెచ్‌పీ పేపర్స్‌ని స్విగ్గీ అందించింది. రానున్న రోజుల్లో అప్డేటెడ్ వర్షెన్, ఆ తర్వాత ఫైనల్ వర్షెన్ కూడా ఫైల్ చేస్తుంది. ఆ సమయంలో స్విగ్గీ ఐపీఓకి సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.
మరోవైపు ఈ ఏడాది నవంబర్‌లో స్విగ్గీ ఐపీఓ లాంచ్ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ లేదు. స్విగ్గీ ఐపీఓ డేట్‌పై రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది.
జొమాటో తర్వాత స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న రెండో ఫుడ్‌టెక్ కంపెనీ ఈ స్విగ్గీ. ఐపీఓ కోసం కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, జెఫరీస్ ఇండియా, అవెండస్ క్యాపిటల్ లను బ్యాంకర్లుగా సంస్థ నియమించుకుంది..
ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ విభాగాల్లో వేగవంతమైన వృద్ధితో 2024 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ తన నష్టాలను 43% తగ్గించుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 36 శాతం పెరిగి రూ.11,247 కోట్లకు చేరింది. ఫుడ్ డెలివరీ, ఇన్‌స్టామార్ట్, డైనింగ్ వంటి కన్స్యూమర్ ఫేసింగ్ బిజినెస్ లో రూ.35,000 కోట్ల స్థూల ఆర్డర్ విలువ (జీఓవీ) నమోదైంది.
గ్రాస్ ఆర్డర్ వాల్యూలో పెరుగుదల
2025 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో స్విగ్గీ కన్సాలిడేటెడ్ వ్యాపారం స్థూల ఆర్డర్ విలువ (జిఒవి) రూ .10,189 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం పెరిగి రూ.3,222 కోట్లకు చేరుకుంది.
తమ వ్యాపారం ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో కేంద్రీకృతం కాలేదని, కొత్త నగరాల్లో తన యూజర్, భాగస్వామ్య ప్లేసెస్‌ని విస్తరించడానికి కంపెనీ ఈ ఆదాయాన్ని ఉపయోగిస్తుందని స్విగ్గీ తెలిపింది.
బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్ వంటి పోటీదారులు క్విక్ కామర్స్ రంగంలో తమ ఉనికిని ముమ్మరం చేస్తున్నందున.. స్విగ్గీ ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇన్‌స్టామార్ట్ విస్తరణకు కేటాయించాలని ఈ ఫుడ్ డెలివరీ సంస్థ యోచిస్తోంది.
ఇటీవల ఓలా ఎలక్ట్రిక్, ఫస్ట్ క్రై, యూనికామర్స్ ఐపీఓల్లో లాభాలు ఆర్జించిన సాఫ్ట్‌బ్యాంక్ ఓఎఫ్ఎస్ కింద తన వాటాను విక్రయించడం లేదు. ఇన్వెస్ట్మెంట్ సంస్థ తన వాటాను కొనసాగించే అవకాశం ఉందని మింట్ గతంలో నివేదించింది.
అనేక నగరాల్లో ఉనికిని మరింత విస్తృతం చేస్తున్నందున వచ్చే నాలుగేళ్లలో కిరాణా, గృహ నిత్యావసరాలను అందించే డార్క్ స్టోర్ల నెట్‌వర్క్‌లను రెట్టింపు చేయడానికి స్విగ్గీ తాజా నిధులను ఉపయోగిస్తుందని మింట్ ఈ నెల ప్రారంభంలో నివేదించింది.
2014లో రెస్టారెంట్ అగ్రిగేటర్‌గా ప్రారంభమైన బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ గత 18 నెలలుగా మార్జిన్లను మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించింది. 2023 మార్చిలో తమ ఫుడ్ డెలివరీ యూనిట్ లాభదాయకంగా మారిందని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీహర్ష మాజేటి తెలిపారు.
సంబంధిత కథనం