Tata Nano Electric Car: టాటా నానో ఎలక్ట్రిక్ కారు డిజైన్ లీక్.. అసలు నిజమిదే!
Tata Nano Electric Car: టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఇదేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అసలు నిజం వేరే ఉంది.
Tata Nano Electric Car: దేశ ఆటోమొబైల్ రంగంలో టాటా నానో కారు ఒకప్పుడు సంచలనం సృష్టించింది. 2008లో కేవలం రూ.లక్ష ధరతో అడుగుపెట్టి.. చరిత్రలో చీపెస్ట్ కారుగా నిలిచింది. మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా ఈ కారును టాటా గ్రూప్స్ తీసుకొచ్చింది. కానీ డిమాండ్ తగ్గిపోవడం, సేఫ్టీ రెగ్యులేషన్స్ కారణంగా 2020లో నానో కార్లను నిలిపివేసింది ఆ సంస్థ. అయితే ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ విపరీతంగా ఉంది. దీంతో టాటా నానో ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని టాటా మోటార్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2025లోగా ఈ కార్ భారత మార్కెట్లోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఇదేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డిజైన్ లీక్ అయిందంటూ ఆ పోస్టులో ఉంది. వైరల్‍గా మారిన ఆ విషయంలో నిజమెంతో ఇక్కడ తెలుసుకోండి.
సోషల్ మీడియాలో పోస్ట్ ఇలా..
రతన్ టాటా జీ డ్రీమ్ కార్ టాటా నానో.. కొత్త రూపంలో త్వరలో ఇండియాలో లాంచ్ కానుందంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.2లక్షల నుంచి రూ.3లక్షలుగా ఉంటుందంటూ.. ఆ కారుకు సంబంధించిన ఓ ఫొటో కూడా చక్కర్లు కొడుతోంది.
ఇదీ నిజం..
అయితే, అది టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఫొటో కాదు. టొయోటా ఐగో (Toyota Aygo) కారు ఫొటోను ఎడిట్ చేసి.. కొందరు దాన్ని టాటా నానో ఎలక్ట్రిక్ మోడల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీనికి టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా ఫొటోను కూడా జత చేశారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ ఫొటో టాటా నానోది కాదు. టయోటా ఐగోదే అని తేలింది. టయోటా ఐగో ఇంకా భారత్‍లోకి రాలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..
2025లో టాటా నానో ఎలక్ట్రిక్ కారు
Tata Nano Electric Car: టాటా నానో ఎలక్ట్రిక్ కారు 2025లో భారత మార్కెట్లోకి వస్తుందని అంచనాలు వస్తున్నాయి. ఎంతో పాపులర్ అయిన నానో పేరుతో బడ్జెట్ రేంజ్‍లో ఎలక్ట్రిక్ కారు తీసుకురావాలన్న అంశాన్ని టాటా మోటార్స్ పరిగణిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. గత నానాతో పోలిస్తే ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, సస్పెన్షన్ సెటప్‍లో చాలా అప్‍గ్రేడ్లతో దీన్ని తెచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై టాటా ఇంకా అధికారికంగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అయితే టాటా నానో ఎలక్ట్రిక్ కార్ లాంచ్ అయితే అది గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది.
టాపిక్