Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
స్టాక్ మార్కెట్ లో వరుస లాభాల ర్యాలీకి శుక్రవారం బ్రేక్ పడింది. ఉదయం కొద్ది సమయం మినహాయిస్తే, రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. శుక్రవారం నిఫ్టీ 172 పాయింట్లు లేదా 0.76 శాతం క్షీణించి 22,475.85 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 733 పాయింట్లు లేదా 0.98 శాతం నష్టంతో 73,878.15 వద్ద స్థిరపడింది.
Stock market: భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ లు నిఫ్టీ 50, సెన్సెక్స్ లు మే 3, శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్ లోసాధించిన లాభాలను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 22,766.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 0.65 శాతం పెరిగి 22,794.70 వద్ద ముగిసింది. అయితే ఈ సెషన్ నిఫ్టీ సూచీ మొత్తంగా 1.3 శాతం క్షీణించి 22,348.05 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 407 పాయింట్లు లాభంతో 75,017.82 వద్ద ప్రారంభమై, 484 పాయింట్లు లేదా 0.65 శాతం లాభపడి 75,095.18 గరిష్టానికి చేరింది. కానీ, సెషన్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 1.5 శాతం క్షీణించి 73,467.73 వద్ద స్థిరపడింది.
టాప్ గెయినర్స్
నిఫ్టీ ఇండెక్స్ లో కోల్ ఇండియా, గ్రాసిమ్, ఓఎన్జీసీ షేర్లు 1-5 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు లార్సెన్ అండ్ టుబ్రో, మారుతి, నెస్లే షేర్లు 2-3 శాతం నష్టంతో టాప్ లూజర్స్ గా నిలిచాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లో దాదాపు రూ.408.5 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.406.2 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే, ఇన్వెస్టర్లు ఈ సెషన్ లో దాదాపు రూ. 2.3 లక్షల కోట్లను నష్టపోయారు. అస్థిరత సూచీ ఇండియా విఐఎక్స్ దాదాపు 9 శాతం క్షీణించి 15 కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. ఇది మార్కెట్లో ఆందోళనను సూచిస్తుంది.
భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు ఎందుకు పడిపోయింది?
భారత స్టాక్ మార్కెట్ (Stock market) ఇటీవల గణనీయమైన ఒడిదుడుకులను చవిచూసింది. గత ఐదు సెషన్లుగా నిఫ్టీ ప్రత్యామ్నాయంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. మార్కెట్ ఉన్నత స్థాయిలో ఆరోగ్యకరమైన దిద్దుబాటు (correction) ను చూస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రాఫిట్ బుకింగ్ వల్ల తలెత్తిందని, ఇది ఆందోళన కలిగించే విషయం కాదని భావిస్తున్నారు. బెంచ్ మార్క్ సూచీలు ఆల్ టైమ్ గరిష్టాలకు దగ్గరగా ట్రేడవుతుండటం ఈక్విటీ మార్కెట్ల పతనానికి కారణం. అమెరికాలో కీలకమైన వ్యవసాయేతర పేరోల్స్ డేటాకు ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, ఇది భవిష్యత్తులో రేట్ల కోత సంభావ్యత గురించి బలమైన సంకేతాలను ఇస్తుందని స్టాక్స్ బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీష్ చౌదరి అన్నారు. ముడిచమురు గరిష్ఠ స్థాయిల నుంచి తగ్గుముఖం పట్టడం, కార్పొరేట్ రాబడుల విషయంలో ఇప్పటి వరకు పెద్దగా ప్రతికూల ఫలితాలు లేకపోవడం, బలమైన దేశీయ ఆర్థిక సూచికలు ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లలో పెద్దగా ప్రతికూల ప్రతిస్పందన ఉండదని, స్వల్ప, మధ్యకాలికంగా మార్కెట్లపై సానుకూల పక్షపాతం కనిపిస్తోందని చౌదరి అన్నారు.
ఎన్నికల ఫలితాల ఉత్కంఠ
దేశీయంగా క్యూ4 ఫలితాల ప్రకటన, లోక్ సభ ఎన్నికల (lok sabha elections 2024) ఫలితాల ఉత్కంఠ, అధిక స్థాయి మార్జిన్ ట్రేడింగ్ వంటి అంశాలు మార్కెట్ హెచ్చుతగ్గులకు గణనీయంగా దోహదం చేస్తున్నాయి. జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అస్థిరతలు మరింత పెరిగే అవకాశం ఉంది.