Reliance Hanooman: ఇండియన్ చాట్ జీపీటీ ‘హనూమాన్’; ఈ మార్చిలోనే అందుబాటులోకి..
Reliance ChatGPT: రిలయన్స్ ఇండస్ట్రీస్, టాప్ ఇంజినీరింగ్ స్కూల్స్ సహకారంతో భారత్ జీపీటీ గ్రూప్ హనుమన్ పేరుతో చాట్ జీపీటీ తరహా సేవలను ప్రారంభించనుంది. ఎనిమిది ఐఐటీల సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ఏఐ మోడల్ హెల్త్ కేర్, గవర్నెన్స్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ రంగాల్లో యూజర్లకు సహకరిస్తుంది.
Reliance ChatGPT: భారతదేశంలో స్వదేశీ కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల సహకారంతో భారత్ జిపిటి గ్రూప్ తన మొదటి చాట్ జీపీటీ తరహా సేవను వచ్చే నెలలో ప్రారంభించనుంది.ఈ చాట్ జీపీటీకి హనూమాన్ (Hanooman) అనే పేరును నిర్ణయించింది.
భారతీయ చాట్ జీపీటీ హనూమాన్
ఎనిమిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) సహకారంతో ఈ ఏఐ మోడల్ పే అభివృద్ధి చేస్తున్నారు. దీనికి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నాయి. రిలయన్స్, ఎనిమిది ఐఐటీలతో కూడిన కన్సార్టియం ఇటీవల ముంబైలో జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో ఈ మోడల్ పనితీరును ఒక డెమో ద్వారా వివరించింది. హనూమన్ గా పిలువబడే ఈ మోడల్ ద్వారా మోటార్ సైకిల్ మెకానిక్ తమిళంలో ఈ Hanooman చాట్ బాట్ తో సంభాషించడం, ఒక బ్యాంకర్ హిందీలో ఈ చాట్ బాట్ తో సంభాషించడం, హైదరాబాద్ కు చెందిన ఒక డెవలపర్ కంప్యూటర్ కోడ్ రాయడానికి ఈ టూల్ ను ఉపయోగించడాన్ని ఆ డెమోలో ప్రదర్శించారు.
11 భాషల్లో..
ఆరోగ్య సంరక్షణ, పాలన, ఆర్థిక సేవలు, విద్య అనే నాలుగు రంగాల్లో 11 స్థానిక భాషల్లో హనూమాన్ (Hanooman) అనే ఈ ఏఐ మోడల్ పనిచేస్తుంది. ఈ 'హనూమన్' మోడల్ ‘స్పీచ్-టు-టెక్స్ట్’ సామర్థ్యాలను కూడా అందిస్తుంది, ఇది రానున్న కాలంలో మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతుందని ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం చైర్మన్ గణేష్ రామకృష్ణన్ పేర్కొన్నారు. ప్రైవేట్-ప్రభుత్వ భాగస్వామ్యంలో మొదటి సారి భారత్ లో హనూమాన్ (Hanooman) పేరుతో చాట్ జీపీటీ సేవలను ప్రారంభించనున్నారు.
కస్టమైజ్డ్ మోడల్స్
లైట్ స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, బిలియనీర్ వినోద్ ఖోస్లా ఫండ్ వంటి ప్రముఖ వెంచర్ కాపిటలిస్ట్ లు, ఇన్వెస్టర్ల మద్దతుతో సర్వం, కృతిమ్ వంటి మరికొన్ని కృత్రిమ మేథ ఆధారిత స్టార్టప్ లు కూడా పని చేయడం ప్రారంభించాయి. ఇవి ఓపెన్ సోర్స్ ఏఐ మోడళ్లపై పనిచేస్తున్నాయి. రిలయన్స్ జియో నిర్దిష్ట ఉపయోగాల కోసం కస్టమైజ్డ్ మోడళ్లను రూపొందించాలని యోచిస్తున్నట్లు నివేదిక తెలిపింది. రిలయన్స్ గ్రూప్ లో ఇప్పటికే 450 మిలియన్ల చందాదారులున్న నెట్వర్క్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించే ప్లాట్ ఫామ్ 'జియో బ్రెయిన్' పనిచేస్తోంది.