Jio AirFiber: ఎయిర్ ఫైబర్ ప్రారంభించిన జియో.. మొదట ఈ 8 నగరాల్లోనే; ఫీచర్స్, రేట్స్, సర్వీసెస్ ఇవే..
Jio AirFiber: ప్రతీ ఇంటికీ ఇంటర్నెట్ ను, ఇంటర్నెట్ ఆధారిత సేవలను అందించే లక్ష్యంతో ‘జియో ఎయిర్ ఫైబర్’ (Jio AirFiber) ను రిలయన్స్ జియో ప్రారంభించింది. మొదట 8 నగరాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, త్వరలో దేశవ్యాప్తంగా అందిస్తామని తెలిపింది.
Jio AirFiber: దేశ వ్యాప్తంగా ప్రతీ ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే లక్ష్యంతో జియో ఎయిర్ ఫైబర్ సేవలను ప్రారంభిస్తున్నామని రిలయన్స్ గ్రూప్ సంస్థ జియో మంగళవారం ప్రకటించింది. ఈ సేవలకు సంబంధించిన సేవలను, టారిఫ్ లను వెల్లడించింది.
8 నగరాల్లోనే..
ప్రస్తుతానికి హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్ కతా లలో ఈ సేవలు ప్రారంభమవుతున్నాయని జియో వెల్లడించింది. జియో ఎయిర్ ఫైబర్ తో తమ మార్కెట్ మరింత విస్తృతమవుతుందని పేర్కొంది. ప్రతీ కస్టమర్ కు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సేవలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొంది. తాము అందించే సేవల్లో డిజిటల్ ఎంటర్టైన్ మెంట్, స్మార్ట్ హోం సర్వీసెస్, బ్రాడ్ బ్యాండ్.. మొదలైనవి ఉంటాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు. ఒక ఇంట్లో అవసరమైన అన్ని డిజిటల్ సేవలను ఈ ఎయిర్ ఫైబర్ ద్వారా అందిస్తామని తెలిపారు.
Jio's AirFiber features: జియో ఎయిర్ ఫైబర్ ఫీచర్స్
జియో ఎయిర్ ఫైబర్ ద్వారా 550 కి పైగా డిజిటల్ టీవీ చానెల్స్ ను వీక్షించవచ్చు. అలాగే, దాదాపు 16 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను చూడడానికి యాక్సెస్ లభిస్తుంది. విస్తృతమైన కవరేజీతో హై స్పీడ్ వైఫై సర్వీసెస్ లభిస్తాయి. ఎడ్యుకేషన్, వర్క్ ఫ్రం హోం కు ఉపయోగపడేలా క్లౌడ్ పీసీ వంటి స్మార్ట్ హోం సర్వీసెస్ లభిస్తాయి. డిజిటల్ సెక్యూరిటీ, సర్వీలెన్స్ కు ఉపయోగపడే సేవలను కూడా ఇది అందిస్తుంది. గేమింగ్, హోం నెట్ వర్కింగ్, స్మార్ట్ హోం ఐఓటీ, హెల్త్ కేర్ సర్వీసెస్ ను కూడా పొందవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ తో వైఫై రౌటర్, 4కే స్మార్ట్ సెట్ టాప్ బాక్స్, వాయిస్ యాక్టివ్ రిమోట్ లను ఉచితంగా పొందవచ్చు.
Jio AirFiber Plans: జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్
జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ రూ. 399 నుంచి ప్రారంభమై, రూ. 3,999 వరకు ఉన్నాయి. హై స్పీడ్ ఇంటర్నెట్, నెట్ ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్.. మొదలైన ప్రీమియం సేవలను పొందడానికి ఎయిర్ ఫైబర్ మాక్స్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ టారిఫ్ రూ. 1499 నుంచి 3,999 వరకు ఉంటుంది. జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ కోసం 60008-60008 నంబర్ కు కాల్ చేయొచ్చు. లేదా www.jio.com లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా దగ్గర్లోని జియో స్టోర్ కు వెళ్లవచ్చు.