Ratan Tata's will: రతన్ టాటా ఆస్తిలో బట్లర్ సుబ్బయ్యకు కూడా వాటా; ‘టిటో’ జాగ్రత్త అని సూచన
Ratan Tata's will: ఇటీవల మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తన ఆస్తిలో దశాబ్దాలుగా తనకు సేవ చేసిన బట్లర్ సుబ్బయ్యకు కూడా వాటా ఇవ్వాలని రతన్ టాటా కోరారు. అలాగే, తన జర్మన్ షెఫర్డ్ పెంపుడు కుక్క టిటో ను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు..
Ratan Tata's will: ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తన వీలునామాలో తన జర్మన్ షెపర్డ్ టిటో బాగోగులను ప్రస్తావించారు, తన ప్రియమైన పెంపుడు కుక్కకు "అపరిమిత సంరక్షణ" కావాలని కోరారు.
పెంపుడు కుక్కపై ప్రేమ
రతన్ టాటా ఆస్తుల విలువ సుమారు రూ.10,000 కోట్లు. తన ఆస్తిలో తన సోదరీమణులు షిరీన్, డీనా జెజీభాయ్, ఇంటి సిబ్బంది తదితరులకు కూడా వాటాలను పంచిపెట్టారు. అయితే, ఆస్తిలో తన పెంపుడు జంతువుకు కూడా వాటా ఇవ్వాలనుకోవడం, అత్యంత సంపన్నుల్లో కూడా అసాధారణం. తన పెంపుడు శునకం, జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన శునకాన్ని రతన్ టాటా ఐదారేళ్ల క్రితం నుంచి పెంచుకుంటున్నారు. గతంలో రతన్ టాటా వద్ద ఉన్న శునకం ‘టిటో’ చనిపోవడంతో, దాని పేరే ఈ జర్మన్ షెఫర్డ్ కు పెట్టారు. ఈ పెంపుడు కుక్క టిటో బాధ్యతలను తన చిరకాల వంటమనిషి రాజన్ షా చూసుకోవాలని రతన్ టాటా తన వీలునామాలో పేర్కొన్నారు.
బట్లర్ సుబ్బయ్యకు వాటా
తనతో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న బట్లర్ సుబ్బయ్యకు కూడా తన ఆస్తిలో వాటా ఇవ్వాలని రతన్ టాటా కోరారు. విదేశాలకు వెళ్లినప్పుడు వంటమనిషి రాజన్, బట్లర్ సుబ్బయ్యల కోసం రతన్ టాటా ప్రత్యేకంగా డిజైనర్ దుస్తులను కొనుగోలు చేసేవాడు. అలాగే, రతన్ టాటా యువ స్నేహితుడు, రతన్ టాటా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడు పేరును కూడా ఈ వీలునామాలో ప్రస్తావించారు. నాయుడుకు చెందిన గుడ్ ఫెలోస్ స్టార్ట్ అప్ లో తన వాటాను రతన్ టాటా వదులుకున్నారు. అలాగే, శంతను విద్యా రుణాలను మాఫీ చేశారు.
రతన్ టాటా ఆస్తులు
రతన్ టాటా (ratan tata)కు అలీబాగ్ లో 2,000 చదరపు అడుగుల బీచ్ బంగ్లా, ముంబైలోని జుహు తారా రోడ్డులో రెండంతస్తుల ఇల్లు, రూ.350 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు, 165 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ లో 0.83 శాతం వాటా ఉన్నాయి. కాగా, రతన్ టాటా కోరిక మేరకు టాటా సన్స్ లో ఆయన వాటాను చారిటబుల్ ట్రస్ట్ అయిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (ఆర్టీఈఎఫ్)కు బదిలీ చేస్తారు. టాటా వీలునామాను బాంబే హైకోర్టు పరిశీలించే అవకాశం ఉందని, ఈ ప్రక్రియకు కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. పరోపకారిగా, జంతు ప్రేమికుడిగా, వ్యాపారవేత్తగా పేరొందిన రతన్ టాటా 2024 అక్టోబర్ 9న కన్నుమూశారు.