Paytm Share Price: మరోసారి భారీగా పతనమైన పేటీఎం షేర్.. కారణం ఇదే!
Paytm Share Price: భారత స్టాక్ మార్కెట్‍లో పేటీఎం షేర్ విలువ మరోసారి భారీగా పడిపోయింది. జీవితకాల కనిష్ఠాలను నమోదు చేసింది. పేటీఎం క్షీణతకు తాజా కారణం ఏంటంటే..
Paytm Share Price: డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ పేటీఎం (Paytm) కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. పేటీఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (Paytm) షేర్లు మరోసారి భారీగా పడిపోయాయి. మంగళవారం బీఎస్ఈ, నిఫ్టీ ఇంట్రాడేలో ఓ దశలో 11.44 శాతం వరకు పేటీఎం విలువ క్షీణించింది. షేర్ ధర రూ.475కు చేరి.. జీవిత కాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. పెట్టుబడిదారులు భారీగా ఈ కంపెనీ షేర్లను విక్రయించేందుకు మొగ్గు చూపారు. నేడు.. పేటీఎం షేర్లు ఈ స్థాయిలో నష్టపోయేందుకు కొత్త కారణం ఉంది.
Paytm Share Price: ఈ భయంతోనే..!
ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిలీనియర్ మకేశ్ అంబానీ (Mukesh Ambani) .. ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‍లోకి అడుగుపెడతారని మక్వారీ గ్రూప్‍నకు చెందిన ఎనలిస్ట్స్ వెల్లడించారు. అదే జరిగితే పేటీఎం తీవ్రమైన పోటీని ఎదుర్కొనే అవకాశం ఉందన్న భయంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‍కు చెందిన జియో ఫైనాన్స్ సర్వీస్ లిమిటెడ్ గణనీయమైన వృద్ధిని కనబరచగలదని సురేశ్ గణపతి నేతృత్వంతోని మక్వారీ గ్రూప్ విశ్లేషకులు వెల్లడించారు. దీనివల్ల పేటీఎం, బజాజ్ ఫైనాన్స్ లాంటి సంస్థలు భారీగా మార్కెట్ షేర్ కొల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
Paytm Share Price: రికార్డు కనిష్ఠానికి..
నిఫ్టీ, బీఎస్ఈలో పేటీఎం షేర్ నేడు 11.44 శాతం క్షీణించింది. షేర్ ధర రూ.475.10 వరకు పడిపోయింది. మధ్యాహ్నం సెషన్‍లోనూ కోలుకోలేకపోయింది. రోజు ముగిసే సరికి రూ.475.55 వద్ద స్థిరపడింది. గతేడాది నవంబర్ లో లిస్ట్ అయిన పేటీఎంకు ఇదే రికార్డు కనిష్ఠ ధరగా ఉంది.
Paytm Share Price: 70శాతానికి పైగా..
గత సంవత్సరం నవంబర్ 18వ తేదీన భారత మార్కెట్‍లలో పేటీఎం లిస్ట్ అయింది. ఐపీవో ధర ఒక్కో షేర్ కు రూ.2,150 ఉండగా.. రూ.1,929 వద్ద లిస్ట్ అయింది. క్రమంగా పడిపోతూ వస్తూ ఇప్పుడు ఏకంగా రూ.475 దరిదాపులకు చేరింది. ఐపీవో ధరతో పోలిస్తే 75 శాతం వరకు పేటీఎం షేర్ విలువ పడిపోయింది. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు.
Paytm Share Price: లాక్ ఇన్ పీరియడ్ కూడా..
పేటీఎం లాక్ ఇన్ పీరియడ్ కూడా ఈనెల మొదట్లోనే ముగిసింది. ఐపీవో కంటే ముందే పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేందుకు అవకాశం లభించింది. దీంతో ప్రధాన ఇన్వెస్టర్ గా ఉన్న సాఫ్ట్ బ్యాంక్.. ఏకంగా 2.93కోట్ల పేటీఎం షేర్లను విక్రయించిందని ఎన్ఎస్ఈ డేటా ద్వారా తెలుస్తోంది. అంటే 4.5 శాతం వాటాను ఆ కంపెనీ తగ్గించుకుంది. ఒక్కో షేర్ కు రూ.555.67 విలువ దగ్గర ఈ లావాదేవీ జరిగింది. పేటీఎంలో సాఫ్ట్ బ్యాంక్‍కు 17.45 శాతం వాటా ఉంది. ఈ ట్రాన్సాక్షన్ తర్వాత అది 12.95కు తగ్గింది.
టాపిక్