Olectra Hydrogen Buses: త్వరలో రోడ్లపైకి ఒలెక్ట్రా ‘హైడ్రోజన్ బస్సులు’: ఒక్కసారి ఫుల్ చేస్తే 400 కిలోమీటర్లు
Olectra Hydrogen Buses: ఒలెక్ట్రా హైడ్రోజన్ బస్సులు రహదారులపైకి రానున్నాయి. ఒక్కసారి హైడ్రోజన్ నింపితే ఈ బస్సు 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ బస్సుల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
Olectra Hydrogen Buses: పర్యావరణహితమైన హైడ్రోజన్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ (OGL) సిద్ధమైంది. మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థే ఓజీఎల్. అతి త్వరలో ఒలెక్ట్రా హైడ్రోజన్ బస్సులు రహదారులపైకి రానున్నాయి. పర్యావరణానికి హితంగా ఉండే ప్రజా రవాణా వ్యవస్థను అందరికీ చేరువ చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఒలెక్ట్రా ప్రకటించింది. రిలయన్స్ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో హైడ్రోజన్ బస్సులను ఒలెక్ట్రా రూపొందించింది. ఈ బస్సుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.
పర్యావరణహితంగా..
Olectra Hydrogen Buses: డీజిల్, పెట్రోల్, సీఎన్‍జీ వాహనాల వల్ల వాతావరణం కాలుష్యం అవుతోందని, హైడ్రోజన్ వాహనాలు కర్బన రహితంగా ఉంటాయని ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ (OGL) వెల్లడించింది. అందుకే హైడ్రోజన్ వాహనాలు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవని పేర్కొంది. ప్రజా రవాణాకు హైడ్రోజన్ బస్సులు వినియోగిస్తే వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని చెప్పింది. పెట్రోల్, డీజిల్ సహా చమురు నిల్వలు ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతుండటం, వాటి ధరలు ఆకాశాన్ని తాకుతుండటం, వాహనాల ఉద్గారాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటం వంటి భవిష్యత్ సవాళ్లకు హైడ్రోజన్ వాహనాలు పరిష్కారంగా కనిపిస్తోందని ఆ సంస్థ పేర్కొంది. కర్బన రహిత హైడ్రోజన్ రవాణా ఆశయాలను సాధించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి ఈ హైడ్రోజన్ బస్సులు దోహదం చేస్తాయని ఆ సంస్థ అభిప్రాయపడింది.
ఒక్కసారి ఫుల్ చేస్తే 400 కిలోమీటర్లు
Olectra Hydrogen Buses: ఒలెక్ట్రా బస్సులో పూర్తిస్థాయిలో ఒక్కసారి హైడ్రోజన్ నింపితే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఓజీఎల్ పేర్కొంది. బస్సులో హైడ్రోజన్ నింపడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఈ హైడ్రోజన్ బస్సు 12 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ బస్సులో డ్రైవర్ సీటు మినహా ప్రయాణికుల కోసం 32 నుండి 49 సీట్లు ఉంటాయి.
పొగకు బదులు నీరు బయటికి
Olectra Hydrogen Buses: పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాలతో నడిచే బస్సుల్లో ఉద్గారాలు పొగ రూపంలో సైలెన్సర్ ద్వారా బయటికి వస్తాయి. అయితే, ఈ హైడ్రోజన్ బస్సులో టెయిల్‌పైప్ ద్వారా కేవలం నీరు మాత్రమే బయటకు వస్తుంది. ఇది పర్యావరణానికి ఏ మాత్రం హానిచేయదని ఓజీఎల్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ప్రజా రవాణాలో అత్యధికంగా వినియోగిస్తున్న డీజిల్, పెట్రోల్ వాహనాలను దశలవారీగా తగ్గించి, వాటి స్థానంలో గ్రీన్ బస్సులను తీసుకురావడానికి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తయారుచేసిన హైడ్రోజన్ బస్సులు సరిగ్గా సూటవుతాయని పేర్కొంది. పర్యావరణహిత ప్రజా రవాణా చరిత్రలో ఒలెక్ట్రా బస్సులు ఒక మైలురాయిగా చెప్పవచ్చని ఆ సంస్థ అభిప్రాయపడింది.
పైభాగంలో సిలిండర్లు
Olectra Hydrogen Buses: ఒలెక్ట్రా హైడ్రోజన్ బస్సు పైభాగంలో టైప్-4 హైడ్రోజన్ సిలిండర్లు ఉంటాయి. ఈ సిలిండర్లు మైనస్ 20 నుంచి ప్లస్ 85 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా తయారయ్యాయి. ఈ బస్సులను ఏడాదిలోగానే వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఒలెక్ట్రా వెల్లడించింది. రానున్నకాలంలో దేశవ్యాప్తంగా హైడ్రోజన్ బస్సులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ప్రజలకు సౌకర్యవంతమైన, పర్యావరణహితమైన రవాణాను అందించడమే తమ లక్ష్యమని ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ పేర్కొంది.
టాపిక్