Deactivate UPI IDs: భారత్ లో రిటైల్ పేమెంట్స్, సెటిల్మెంట్ సిస్టమ్ ను పర్యవేక్షించే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎన్పీసీఐ. యూపీఐ పేమెంట్స్ సిస్టమ్ ను మరింత సురక్షితంగా, మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను విడుదల చేస్తుంటుంది.
యూపీఐ ఐడీ ల వినియోగానికి సంబంధించి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ కు ఎన్పీసీఐ (National Payments Corporation of India NPCI) పలు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా, గత సంవత్సర కాలానికి పైగా ఇనాక్టివ్ గా ఉన్న యూపీఐ ఐడీ లను డీ యాక్టివేట్ చేయాలని ఆ యాప్స్ తో పాటు, సంబంధిత బ్యాంక్ లకు ఆదేశాలు జారీ చేసింది. వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీ యాక్టివేట్ చేయడం ద్వారా రిటైల్ పేమెంట్స్ మరింత సేఫ్ గా మారుతాయని ఎన్పీసీఐ తెలిపింది.
సాధారణంగా, వినియోగదారులు తమ ఫోన్ నంబర్ ను మార్చిన సమయంలో ఆ నంబర్ తో అనుసంధానమై ఉన్న యూపీఐ ఐడీని మార్చడమో, లేక అన్ లింక్ చేయడమో చేయాలి. అలాగే, సంబంధిత బ్యాంక్ ఖాతాలోనూ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ను మార్చుకోవాలి. కానీ, అవగాహన లేని కారణంగా, చాలా మంది ఆ జాగ్రత్తలు తీసుకోరు. దాంతో, ఒకవేళ ఆ నంబర్ వేరే వారికి అలాట్ అయితే, ఆ నంబర్ పై ఉన్న యూపీఐ ఐడీకి ఎవరైనా డబ్బు పంపిస్తే, అది ఆ నంబర్ వాడుతున్న వేరే వ్యక్తికి వెళ్తుంది. ఈ సమస్య నుంచి వినియోగదారులను రక్షించే ఉద్దేశంతో ఎన్సీపీఐ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది.
కనీసం సంవత్సరం పాటు యాక్టివ్ గా లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలన్న సూచనతో పాటు, మరికొన్ని ఆదేశాలను ఎన్సీపీఐ థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్స్ కు జారీ చేసింది. డిసెంబర్ 31, 2023 నుంచి ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.