Fake WhatsApp group: ఈ వాట్సప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ స్కామ్ తో జాగ్రత్త: రూ. 90 లక్షలు పోగొట్టుకున్న ముంబై వాసి
Fake WhatsApp group: వాట్సాప్ లో గుర్తు తెలియని గ్రూప్ ల నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ పై ఆసక్తి చూపకండి. వారు చూపే హై రిటర్న్స్ లకు ఆశ పడకండి. లేదంటే, మీరు కూడా ఈ ముంబై వాసి లా భారీగా నష్టపోతారు. ఇతడు ఫేక్ ఇన్వెస్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్ ఆఫర్ కు మోసపోయి రూ. 90 లక్షలు పోగొట్టుకున్నాడు.
ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఓ వాట్సప్ (whatsapp) గ్రూప్ నుంచి వచ్చిన పెట్టుబడి ఆఫర్లను నమ్మి, ఇన్వెస్ట్ మెంట్ స్కామ్ లో భారీగా మోసపోయాడు. నిపుణుల మార్గదర్శకత్వంలో పెట్టుబడి పెట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ ను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన గ్రూపులో చేరి.. ఆ తర్వాత ఆ వ్యక్తి రూ.90 లక్షలు పోగొట్టుకున్నాడు.
ఈ స్కామ్ ఇలా బయటపడింది
ఈ ముంబై వాసి లాభదాయకమైన పెట్టుబడి చిట్కాలను అందించే "విదేశీ నిపుణులు" నడుపుతున్న వాట్సాప్ గ్రూపులో చేరాడు. గణనీయమైన లాభాలను త్వరగా సంపాదించడానికి వ్యూహాలను అందిస్తామని ఆ గ్రూప్ పేర్కొంది. గ్రూప్ క్రెడెన్షియల్స్, కమ్యూనికేషన్స్ కు ఫిదా అయిన ఆ వ్యక్తి గ్రూప్ లో జరిగే చర్చల్లో చురుకుగా పాల్గొన్నాడు. ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న మొబైల్ యాప్ ను ఉపయోగించి ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసి వారు ఈ వ్యక్తిని మోసగించారు. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ట్రేడింగ్ ప్రారంభించేందుకు రూ.90 లక్షలను బ్రోకర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని వారు బాధితుడికి సూచించారు. ఆ వర్చువల్ ట్రేడింగ్ ఖాతాలో అతడికి మొదట్లో రూ.15.69 కోట్ల లాభాన్ని ఆ మోసగాళ్లు చూపించారు. అయితే బాధితుడు డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, విత్ డ్రా చేయడం వీలు కాలేదు. వాట్సాప్ గ్రూప్ లో ఆ మోసగాళ్లకు సంప్రదిస్తే, అదనంగా రూ.1.45 కోట్లను 10 శాతం 'ప్రాఫిట్ షేరింగ్' ఫీజుగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దాంతో, రూ. 90 లక్షలు మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
1. తెలియని వ్యక్తులు, లేదా గ్రూప్ ల నుంచి వచ్చే పెట్టుబడి ఆఫర్లు స్వీకరించేటప్పుడు జాగ్రత్త వహించండి. పేరున్న పెట్టుబడి సంస్థలు సాధారణంగా గుర్తు తెలియని మార్గాల ద్వారా సంప్రదింపులు జరపవు.
2. పెట్టుబడి పెట్టడానికి ముందు, మీకు ఆఫర్ పంపిన వ్యక్తి గుర్తింపును ధృవీకరించండి. వెరిఫైడ్ అకౌంట్ ఇండికేటర్ల కోసం చూడండి.
3. తెలియని వాటిలో ఇన్వెస్ట్ చేయడం మానుకోండి. ఇన్వెస్ట్ చేసేముందు రీసెర్చ్ చేయండి. పూర్తి అవగాహనతో మాత్రమే పెట్టుబడులు పెట్టండి. అవసరమైతే, ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి.
4. స్కామర్లు తరచుగా బాధితులను వేగంగా నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి చేయడానికి అత్యవసర వ్యూహాలను ఉపయోగిస్తారు. మీరు ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తే, దానిని హెచ్చరిక సంకేతంగా పరిగణించండి.
5. అన్ని ఇన్వెస్ట్మెంట్ లలో రిస్క్ ఉంటుంది. ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్స్ ఇస్తామన్న హామీలు మోసపూరితంగా ఉంటాయి.
6. గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను పంచుకోవద్దు.
7. మీకు ఏదైనా స్కామ్ జరుగుతోందని అనుమానించినట్లయితే, వెంటనే వాట్సాప్ (whatsapp), సంబంధిత అధికారులకు నివేదించండి.