Muhurat Trading 2024: నవంబర్ 1, 2024 శుక్రవారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ అయిన ముహూరత్ ట్రేడింగ్ లో భారత మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ముహూరత్ ట్రేడింగ్ లో మార్కెట్లు లాభాల్లో ముగియడం ఇది వరుసగా ఏడోసారి కావడం విశేషం. ఈ సెషన్ లో సెన్సెక్స్ (sensex) 335.06 పాయింట్లు లాభపడి 79,724.12 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 24,304.35 వద్ద ముగిశాయి. 2023 ముహూర్త సెషన్ లో సూచీలు అర శాతానికి పైగా పెరిగాయి.
భారత స్టాక్ మార్కెట్లో (stock market) నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.68 శాతం, 1.03 శాతం లాభపడటంతో బ్రాడ్ మార్కెట్లు ఈ ప్రత్యేక సెషన్ లో నిఫ్టీ బెంచ్ మార్క్ లను అధిగమించాయి. ఈ రోజు ముహూరత్ ట్రేడింగ్ సెషన్ లో చాలా సెక్టోరల్ ఇండెక్స్ లు కూడా సానుకూలంగా ముగిశాయి. పండుగ సీజన్ లో బలమైన ఆటో అమ్మకాల కారణంగా నిఫ్టీ ఆటో అత్యధికంగా 1.24 శాతం లాభపడింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ వరుసగా 0.96 శాతం, 0.84 శాతం, 0.79 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ 0.68 శాతం లాభపడగా, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫిన్ సర్వీసెస్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.25 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ మాత్రం 0.02 శాతం నష్టపోయింది.