Disney-Reliance merger: డిస్నీ-రిలయన్స్ విలీనం కన్ఫర్మ్; ఈ మెగా డీల్ తో ఏం జరగనుంది?
Disney-Reliance merger: డిస్నీ-రిలయన్స్ విలీనం ఖాయమైంది. భారత్ లో మీడియా, వినోద రంగాల్లో ఈ డీల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతానికి ఈ జాయింట్ వెంచర్ రిలయన్స్ నియంత్రణ లోనే ఉంటుంది. ఇందులో రిలయన్స్ కు 16.34% వాటా, రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18 కు 46.82% వాటా, డిస్నీకి 36.84% వాటా ఉంటుంది.
Disney-Reliance merger: కొన్ని నెలల ఉత్కంఠ తరువాత, డిస్నీ- రిలయన్స్ బుధవారం రాత్రి తమ విలీనం డీల్ ను ఖాయం చేశాయి. భారతదేశంలో ఈ విలీనం ద్వారా 100 కి పైగా లీనియర్ టీవీ ఛానళ్లు, డిస్నీ + హాట్ స్టార్, జియో సినిమా అనే రెండు పెద్ద స్ట్రీమింగ్ సేవలు, భారీ కంటెంట్ లైబ్రరీతో 8.5 బిలియన్ డాలర్ల (రూ .70,000 కోట్లకు పైగా) మీడియా దిగ్గజాన్ని సృష్టించాలని నిర్ణయించినట్లు ఆ రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ ఒప్పందంలో భాగంగా డిస్నీ డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) కంపెనీ టాటా ప్లే లోని 30% వాటా , విఎఫ్ఎక్స్ స్టూడియో ఇండస్ట్రియల్ లైట్ & మ్యాజిక్ (ఐఎల్ఎమ్), కన్సూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ మినహా - తన అన్ని భారతీయ ఆస్తులు, ఉద్యోగులను తన అనుబంధ సంస్థ అయిన స్టార్ ఇండియాకు బదిలీ చేస్తుంది.
ఈ డీల్ కు సంబంధించిన వివరాలేంటి?
ఈ డీల్ లో భాగంగా రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియాలో విలీనమవుతుంది. తద్వారా రూ.58,852 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటు అవుతుంది. ఈ డీల్ పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రూ.11,500 కోట్ల (1.4 బిలియన్ డాలర్లు) వృద్ధి మూలధనాన్ని అందించి, ఈ జాయింట్ వెంచర్ లో 16.34 శాతం ప్రత్యక్ష వాటా పొందుతుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.4,554 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన వయాకామ్ 18 విలువ జేవీలో రూ.32,937 కోట్లు (3.9 బిలియన్ డాలర్లు). అదే ఏడాది రూ.19,857 కోట్ల ఆదాయాన్ని నివేదించిన స్టార్ ఇండియా విలువ రిలయన్స్ పెట్టుబడులకు ముందు రూ.25,915 కోట్లు (3.12 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఇప్పటివరకు వయాకామ్ 18 లో బోధి ట్రీ కి 15.97% వాటా ఉంది. బోధి ట్రీ సంస్థ డిస్నీ అపాక్ సీఈఓ ఉదయ్ శంకర్, జేమ్స్ ముర్డోక్ కు చెందిన లూపా సిస్టమ్స్ జాయింట్ వెంచర్. ఇప్పుడు రిలయన్స్ - డిస్నీ జేవీలో రిలయన్స్ నేరుగా రూ. 11,500 కోట్లను పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఈ జేవీలో బోధి ట్రీ భాగస్వామ్యాన్ని 6.1 శాతానికి తగ్గిస్తుంది.