MG Motor cars price cut: ఎంజీ మోటార్స్ వాహనాల ధరల తగ్గింపు; కోమెట్, ఆస్టర్, హెక్టర్ లపై కూడా..
Price cut on MG Hector: భారత్ లో ప్రాచుర్యం పొందిన పలు మోడళ్ల కార్ల ధరలను ఎంజీ మోటార్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ 2024 మోడల్స్ లో కోమెట్ ఈవీ, జెడ్ ఎస్ ఈవీ, హెక్టర్, ఆస్టర్, గ్లాస్టర్ తదితర కార్లున్నాయి.
శతాబ్ది వేడుకల్లో భాగంగా MG మోటార్ ఇండియా తన 2024 శ్రేణి కార్ మోడళ్లకు కొత్త ధరలను శుక్రవారం ప్రకటించింది. MG ZS EV బేస్ మోడల్ ఇప్పుడు రూ. 18.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. కామెట్ EV, హెక్టర్, ఆస్టర్, గ్లోస్టర్ వంటి మోడళ్ల ధరలను కూడా ఎంజీ మోటార్స్ తగ్గించింది.
హెక్టర్ సహా ఈ మోడల్స్ పై డిస్కౌంట్స్
ఎంజీ మోటార్స్ భారత్ లో ప్రవేశపెట్టిన మొదటి మోడల్ MG హెక్టర్ (MG Hector) . ఈ కారు ధర ఇప్పుడు పెట్రోల్ వెర్షన్ (ఎక్స్-షోరూమ్) కు రూ. 14.94 లక్షలు, డీజిల్ వెర్షన్ (ఎక్స్-షోరూమ్) రూ. 17.50 లక్షల నుండి ప్రారంభమవుతుంది. కామెట్ EV (MG Comet EV) ధర కూడా ఇప్పుడు తగ్గింది. ఈ కారు బేస్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అలాగే, ఎంజీ ఆస్టర్ (MG Astor) మోడల్ ధరల శ్రేణి ఇప్పుడు రూ. 9.98 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఎంజీ మోటార్స్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ గ్లోస్టర్ SUV (MG Gloster) ఇప్పుడు ప్రారంభ ధర రూ. 37.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వినియోగదారులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో తమ కార్ల ధరల శ్రేణిలో తగ్గింపులు చేపట్టామని ఎంజీ మోటార్స్ వెల్లడించింది.
2019 నుంచి..
MG మోటార్స్ (MG Motors) 2019లో తిరిగి భారతదేశంలో అడుగుపెట్టింది. ప్రధానంగా, SUV సెగ్మెంట్ పై ఎంజీ మోటార్స్ దృష్టి సారించింది, ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోలో రెండు ఆల్-ఎలక్ట్రిక్ మోడళ్లను కూడా చేర్చింది. భారతదేశంలో ADAS లేదా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీలలో ఎంజీ మోటార్స్ ఒకటి.