Maruti Suzuki Jimny Offer: మారుతి సుజుకి జిమ్నీ ఎస్యూవీ ని 2023 లో చాలా హైప్ తో భారతదేశంలో లాంచ్ చేశారు. లాంచ్ కు ముందు గొప్పగా ప్రచారం పొందినప్పటికీ.. ఈ ఐదు డోర్ల ఆఫ్-రోడర్ ఎస్ యూవీ భారత్ లో ఆశించిన అమ్మకాలను పొందలేకపోయింది. మారుతి సుజుకీ నెక్సా ప్రీమియం రిటైల్ నెట్ వర్క్ ద్వారా ఈ జిమ్నీ ఎస్యూవీ సేల్స్ కొనసాగుతున్నాయి.
జిమ్నీ పై ఇప్పుడు రూ .1.50 లక్షల వరకు భారీ డిస్కౌంట్ ను మారుతి సుజుకీ ప్రకటించింది. ఇన్వెంటరీని క్లియర్ చేసే ప్రయత్నంలో 2023 మోడళ్లపై 2024 మోడళ్ల కంటే ఎక్కువ డిస్కౌంట్లను సంస్థ ప్రకటించింది. జిమ్నీ 2024 మోడళ్లపై రూ. 50,000 తక్షణ నగదు తగ్గింపు లభిస్తుంది. అదనంగా, అర్హతకు లోబడి రూ . 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉంది. అయితే, వేరియంట్, లొకేషన్, స్టాక్ లభ్యత మొదలైన వాటిని బట్టి ఈ ఆఫర్లు మారవచ్చు. జెటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభించే మారుతి సుజుకి జిమ్నీ ఎస్ యూవీ ధర రూ.12.74 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. భారత్ లో ఉత్పత్తి చేస్తున్న మారుతి సుజుకీ జిమ్నీని భారతదేశంతో పాటు, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా వంటి మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంది.
మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) అనేక ఫీచర్లతో వస్తుంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ట్రాన్స్ మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్ పి పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ ఎస్ యూవీలో సుజుకి యొక్క ఆల్ గ్రిప్ ప్రో 4×4 సిస్టమ్ ఉంది, ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.
లైఫ్ స్టైల్ ఎస్ యూవీ సెగ్మెంట్ లో మహీంద్రా థార్ (Mahindra Thar) వంటి ప్రత్యర్థులతో ఈ మారుతి సుజుకీ జిమ్నీ ఎస్ యూవీ పోటీ పడుతోంది. మహీంద్రా థార్ ప్రస్తుతం 3 డోర్ వేరియంట్ లో అందుబాటులో ఉంది. మహింద్ర థార్ ఐదు-డోర్ల వేరియంట్ త్వరలో మార్కెట్లోకి రానుంది. జిమ్నీని విడుదల చేసినప్పటి నుండి, మారుతి సుజుకీ ఈ ఎస్యూవీ ధరల వ్యూహంపై విమర్శలను ఎదుర్కొంది. ఇది అమ్మకాల సంఖ్యను పెంచడంలో ప్రధాన అడ్డంకిగా ఉంది. రిటైల్ సేల్స్ ను పెంచుకునే ప్రయత్నంలో, మారుతి సుజుకీ జిమ్నీ (Maruti Suzuki Jimny) మోడల్ లో థండర్ ఎడిషన్ ను కూడా విడుదల చేసింది. ఇది రూ .10.74 లక్షలు (ఎక్స్-షోరూమ్) లకు లభిస్తుంది.