Mahindra Zeo Electric : కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ ట్రక్.. ఫాస్ట్ ఛార్జింగ్, మంచి రేంజ్
Mahindra Zeo Electric : ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేస్తున్నాయి. మహీంద్రా కంపెనీ కూడా తాజాగా ఎలక్ట్రిక్ ట్రక్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం..
మహీంద్రా కూడా ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకొస్తుంది. ZEO ఎలక్ట్రిక్ 4W ట్రక్‌తో ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. మహీంద్రా ఇప్పటికే విభిన్న వాహనాలతో మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. వీటిలో పెట్రోల్, సీఎన్‌జి, డీజిల్, ఎలక్ట్రిక్ ఇంధనాలతో నడిచే వాహనాలు ఉన్నాయి.
మొదటిసారిగా మహీంద్రా 4W ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కులలోకి ప్రవేశించింది. కొత్తగా ప్రారంభించిన మహీంద్రా Zeo ఎలక్ట్రిక్ 4W ట్రక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.52 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇది వాణిజ్య వాహనాలను కొనాలి అనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది. మహీంద్రా ZEO ఎలక్ట్రిక్ వాహనం Zeo V1, Zeo V2 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
మహీంద్రా దాని బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్(BaaS) ప్రోగ్రామ్‌తో కూడా ఉంది. దీనిద్వారా కొనుగోలుదారులకు ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ZEO ఎలక్ట్రిక్ ట్రక్కును మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, మహీంద్రా వివిధ ఫైనాన్సింగ్ ఎంపికలను ప్రోత్సహిస్తోంది. BaaS కి.మీకి అద్దె రేటు రూ.2.25గా నిర్ణయించింది.
కొనుగోలుదారులకు 3 సంవత్సరాల లేదా 1.25 లక్షల కి.మీ వాహన వారంటీతో పాటు 7 సంవత్సరాల లేదా 1.5 లక్షల కిమీ బ్యాటరీ వారంటీని అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ఎకో, పవర్ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ మహీంద్రా ZEO ఎలక్ట్రిక్ ట్రక్ క్యాబిన్ ముగ్గురు ప్రయాణికులకు వీలుగా ఉంటుంది. 765 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు.
డిజైన్ గురించి చూస్తే.. ఈ కొత్త మహీంద్రా ZEO ఎలక్ట్రిక్ ట్రక్కు పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. బ్లూ కలర్‌లో గ్రిల్‌లో నిలువు స్లాట్‌లను కలిగి ఉంది. స్టీల్ వీల్స్‌పై డ్యూయల్-టోన్ వీల్ కవర్‌లతో పాటు ఎలక్ట్రిక్ అని చెప్పే బ్లూ రైటింగ్ వస్తుంది. సరిగా కనిపించేందుకు హాలోజన్ హెడ్‌లైట్లు, ఒకే విండ్‌షీల్డ్ వైపర్‌ని కలిగి ఉంది. ఈ మహీంద్రా ZEO ఎలక్ట్రిక్ ట్రక్ అధునాతన డ్రైవర్-సహాయక వ్యవస్థలను కలిగి ఉంది. ఇది (ADAS) భద్రత, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, హెడ్‌వే మానిటరింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ ఫెటీగ్ వార్నింగ్ ఉన్నాయి.
కొత్త మహీంద్రా ZEO ఎలక్ట్రిక్ ట్రక్‌లో 18.4 kWh, 21.3 kWh అనే రెండు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. 18.4 kWh బ్యాటరీ ప్యాక్ మోడల్ 160 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. 21.3 kWh బ్యాటరీ ప్యాక్ మోడల్ 246 కి.మీ రేంజ్ ఇస్తుంది. మహీంద్రా ZEO ఎలక్ట్రిక్ ట్రక్కును ఛార్జ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.
మహీంద్రా ZEO ఎలక్ట్రిక్ 4W ట్రక్ 40 bhp శక్తిని, 114 Nmని అందించే ఒకే ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం 60 నిమిషాల్లో 100 కి.మీగా అవుతుంది. AC ఫాస్ట్ ఛార్జింగ్, హోమ్ ఛార్జింగ్ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనం గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.