iVOOMi S1 Lite E Scooter : మూడేళ్ల వారంటీతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 180 కి.మీ రేంజ్
iVOOMi S1 Lite E Scooter : భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దీనితో కంపెనీలు సైతం మార్కెట్‌లోకి కొత్తవాటిని లాంచ్ చేస్తున్నాయి. మార్కెట్‌లోకి కొత్తగా ఐవూమీ ఎస్1 లైట్ ఈ స్కూటర్ వచ్చింది.
భారతదేశం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ భారీగా ఉంది. చిన్న స్టార్ట్ అప్ బ్రాండ్‌లు కూడా బాగా సేల్ అవుతున్నాయి. ఓలా, ఈథర్, ఒకినావా బ్రాండ్‌లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సెగ్మెంట్లో చిన్న కంపెనీలు కూడా కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. వాటిలో ఒకటి iVoomi. సరసమైన ధరలకు నాణ్యత గల ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ చేసే బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించిన ఐవూమీ.. అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కోసం చూస్తున్న వారి కోసం కొత్త ఈవీని విడుదల చేసింది. ఈ iVoomi S1 లైట్ వేరియంట్ మార్కెట్లో కొత్తది. కేవలం రూ. 84,999 ఎక్స్-షోరూమ్ ధరతో వస్తుంది. ఇది ఓలా ఎంట్రీ-లెవల్ స్కూటర్‌లకు పోటీగా ఉండనుంది.
iVoomi S1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కి.మీ రేంజ్ ఇస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్ వంటి ప్రధాన రాష్ట్రాలతో సహా భారతదేశం అంతటా ఉన్న iVoomi డీలర్‌షిప్‌లలో బ్రాండ్ సరికొత్త EV కోసం బుకింగ్‌లను మెుదలుపెట్టింది. వన్-టైమ్ చెల్లింపు సాధ్యం కాకపోతే.. కంపెనీ EMI ఆప్షన్ కూడా అందిస్తోంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వివిధ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా తయారు చేశారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. సులభంగా హ్యాండిల్ చేయడానికి వీలుగా ఉంటుంది. స్కూటర్ 18 లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా అందిస్తుంది. నిత్యావసర వస్తువులను తీసుకెళ్లేందుకు అనువైనదిగా ఉండనుంది. మీ ఎంపికను ఆధారంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 12-అంగుళాల లేదా 10-అంగుళాల చక్రాలను ఎంచుకోవచ్చు.
ఈ కొత్త ఐవూమీ ఎస్1 లైట్ స్కూటర్‌లో USB ఛార్జింగ్ పోర్ట్ (5V, 1A), సులభమైన స్పీడ్ ట్రాకింగ్ కోసం LED డిస్‌ప్లే స్పీడోమీటర్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐవూమీ ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రతను దృష్టిలో ఉంచుకుని తయారుచేశారు. ఇది రైడర్, వాహనాన్ని రక్షించడానికి 7 స్టెప్స్ సేఫ్టీ లక్షణాలను కలిగి ఉంటుంది.
అయితే ఇందులో మరిన్ని ఫీచర్లు కావాలనుకునే వారు రూ.4,999కి స్మార్ట్ ఫీచర్స్ అప్‌గ్రేడ్‌ను కూడా పొందవచ్చు. వాటిలో iVoomi MT (DTE) సూచిక, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్ కలిగి ఉంది. ఇది స్మార్ట్-కనెక్ట్ చేసిన స్కూటర్ నావిగేషన్, అలర్ట్‌లు, సర్వీస్ రిమైండర్‌ల కోసం కనెక్ట్ యాప్‌ను కలిగి ఉంటుంది. వాహనంలో పనితీరు కోసం ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించారు.