Top 4 Premium Electric Cars: భారీ బ్యాటరీ, అధిక రేంజ్ ఉన్న టాప్-4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Top 4 Premium Electric Cars: ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్, అధిక రేంజ్‍ను కలిగి ఉన్న టాప్-4 ప్రీమియమ్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే. వివరాలు చూడండి.
Top 4 Premium Electric Cars: భారత మార్కెట్‍లో ఎలక్ట్రిక్ కార్లు క్రమంగా పాపులర్ అవుతున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కూడా అధికమవుతున్నాయి. దీంతో మార్కెట్‍లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్లను ఆటోమొబైల్ తయారీ సంస్థలు తీసుకొస్తున్నాయి. బడ్జెట్ నుంచి ప్రీమియమ్ రేంజ్ వరకు ప్రస్తుతం చాలా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. కాగా, అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ, ఎక్కువ రేంజ్‍ను కలిగి ఉన్న టాప్-4 ప్రీమియమ్ ఎలక్ట్రిక్ కార్లు ఏవో ఇక్కడ చూడండి.
కియా ఈవీ6 (Kia EV6)
కియా ఇండియా ఇటీవల కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. 77.4 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ప్యాక్‍తో ఈ కారు వచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 708 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. జీటీ లైన్, జీటీ లైన్ ఏడబ్ల్యూడీ వేరియంట్లలో ఈ నయా వెర్షన్ కారు అందుబాటులో ఉంది. కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.60.95లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉంది.
హ్యుండాయ్ ఐయానిక్ 5 (Hyundai Ioniq 5)
హ్యుండాయ్ ఐయానిక్ 5 ఇండియాలో ఈ ఏడాదే విడుదలైంది. ఈ కారులో 72.6kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 631 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. హ్యుండాయ్ ఐయానిక్ 5 ధర రూ.44.95లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. హ్యుండాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు డెలివరీలు ఇండియాలో ఇటీవలే ప్రారంభం అయ్యాయి.
బీవైడీ అటో 3 (BYD Atto 3)
బీవైడీ కంపెనీ నుంచి అటో 3 ఎలక్ట్రిక్ కారు మార్కెట్‍లో అందుబాటులో ఉంది. ఇప్పటికే 700 యూనిట్లను బీవైడీ డెలివరీ చేసింది. బీవైడీ అటో 3 కారులో 60.48kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ కారులో 521 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రెండు వెర్షన్‍లలో ఈ ఎలక్ట్రిక్ కారు లభిస్తోంది. బీవైడీ అటో 3 స్టాండర్డ్ ధర రూ.33.99లక్షలు, స్పెషల్ ఎడిషన్ ధర రూ.34.49లక్షలుగా ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూం ధరలు.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ (MG ZS EV)
భారత మార్కెట్‍లో ఎంజీ సంస్థ నుంచి లాంచ్ అయిన తొలి ఎలక్ట్రిక్ కారు జెడ్ఎస్ ఈవీ. 50 kWh బ్యాటరీ ప్యాక్‍తో ఎంజీ జెడ్ఎస్ ఈవీ వచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.23.38లక్షలుగా ఉంది.