Jeep new EV : జీప్ నుంచి కొత్త అఫార్డిబుల్ ఈవీ.. ఇండియాలో లాంచ్ ఎప్పుడు?
Jeep New EV : జీప్ సంస్థ నుంచి ఒక కొత్త ఈవీ సిద్ధమవుతోంది. మరి ఈ అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందా?
Jeep New EV 2024 : దిగ్గజ అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ జీప్.. సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్‌ని సిద్ధం చేస్తోంది. ఈ అఫార్డిబుల్ ఎస్యూవీ.. ఇంకొన్ని నెలల్లో అమెరికాలో లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో.. ఈ కొత్త జీప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
జీప్ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్..
జీప్ అవెంజర్ ఈవీ.. ఇప్పటికే యూరోప్ మార్కెట్లో అందుబాటలో ఉంది. దీని ధర 35వేల యూరోలు. అంటే సుమారు రూ. 31.50 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్.. ఈ వారంలోనే అమెరికాలో లాంచ్ అవుతోంది. కానీ ఈ ప్రీమియం ఈవీ బడ్జెట్ కాస్త ఎక్కువే! అందుకే.. అందుబాటు ధరలో, అఫార్డిబుల్ ఈవీని తీసుకురావాలని జీప్ సంస్థ ప్లాన్ చేస్తోందట. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌కి ఇంకా పేరు పెట్టలేదు కానీ.. దీని ధర 25వేల డాలర్లు, అంటే రూ. 20లక్షల కన్నా తక్కువగానే ఉంటుందని సమాచారం. స్టాలింటిస్ సీఈఓ కార్లోస్ టావేరెస్ సైతం దీనిని ధ్రువీకరించారు. జీప్, సిట్రోయెన్, ఫియట్‌తో పాటు ఇతర బ్రాండ్స్‌కి ఓ ఓనర్ ఈ స్టాలింటిస్.
"20వేల యూరోల సిట్రోయెన్ ఈ-సీ3ని మోము తీసుకొచ్చినట్టే.. 25వేల డాలర్ల జీప్ని కూడా త్వరలోనే తీసుకొస్తాము. అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ వెహికిల్ ధర ఎంత ఉంటుంది? అని నన్ను అడిగితే.. యూరోప్‌లో 20వేల యూరోలు, అమెరికాలో 25వేల డాలర్లు అని చెబుతాను," అని కార్లోస్ అన్నారు.
Jeep Avenger EV launch date in India : ప్రస్తుతం.. అమెరికా మార్కెట్లో నిస్సాన్ లీఫ్, ఆరియా వంటివి అతి చౌకైన ఈవీలుగా ఉన్నాయి. వీటి ధర 28వేల డాలర్లు, అంటే సుమారు రూ. 23.30 లక్షలు. కానీ అమెరికా ఆటోమొబైల్ మార్కెట్లోని ఈవీ సెగ్మెంట్లో ఇటీవలి కాలంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైనీస్ కంపెనీల దండయాత్రతో.. ఎలక్ట్రిక్ వాహనాల ధరల్లో చాలా పోటీ కనిపిస్తోంది. పోటీని ఎదుర్కొనేందుకు చాలా కంపెనీలు ధరలను తగ్గిస్తున్నాయి. అందుకే చాలా మంది అఫార్డిబుల్ ఈవీలపై ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు.
జీప్ కొత్త ఈవీ.. ఇండియాలో లాంచ్ అవుతుందా?
India electric vehicles : బీభత్సమైన డిమాండ్ కనిపిస్తున్న ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో జీప్‌కి ఇంకా ఒక్క ఎలక్ట్రిక్ వెహికిల్ కూడా లేదు. కానీ.. కంపాస్, మెరీడియన్, వ్రాంగ్లర్, గ్రాండ్ చెరోకీ వంటి ఐసీఈ మోడల్స్ దుమ్మురేపుతున్నాయి. మరి.. ఈవీని ఇండియాకు తీసుకొచ్చే ప్లాన్ ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు సానుకూలంగా స్పందించారు జీప్ ఇండియా బ్రాండ్ డైరక్టర్ ప్రియేశ్ కుమార్. ఆ ఆప్షన్ గురించి చాలా చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. కానీ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. దేశీయ మార్కెట్లో ఏది బాగా క్లిక్ అవుతుంది? దేనికి మంచి డిమాండ్ ఉంది? అన్నది నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు, ఆ డేటా ఆధారంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిపారు.
మరి ఈ జీప్ కొత్త ఈవీ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.
సంబంధిత కథనం