Edible oils : వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం-india sharply raises import tax on edible oils to support farmers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Edible Oils : వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం

Edible oils : వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం

Sharath Chitturi HT Telugu

Edible oil duty news : వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది దేశీయ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది.

వంట నూనెలపై దిగుమతి సుంకం పెంపు..

ముడిచమురు, శుద్ధి చేసిన వంట నూనెలపై దిగుమతి పన్నును భారత్ 20 శాతం పెంచింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వంట నూనెల దిగుమతిదారుగా ఉన్న భారత్​.. తక్కువ నూనె గింజల ధరలతో అల్లాడుతున్న రైతులను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంది.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో వంట నూనెల ధరలు పెరిగి, డిమాండ్​ తగ్గొచ్చు. ఫలితంగా సోయా, పొద్దుతిరుగుడు నూనెల దిగుమతి తగ్గొచ్చు.

వంటనూనెల దిగుమతిపై సుంకాల పెంపు ప్రకటన తర్వాత చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ 2 శాతానికి పైగా పడిపోయింది.

ముడి పామాయిల్, ముడి సోయాయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనెలపై సెప్టెంబర్ 14 నుంచి 20 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని భారత ప్రభుత్వం విధించింది.

ఇదీ చూడండి:- Southwest monsoon : భారీ వర్షాల నుంచి రిలీఫ్​! నైరుతి రుతుపవనాల ఉపసంహరణపై కీలక అప్డేట్​..

భారత వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్, సోషల్ వెల్ఫేర్ సర్​ఛార్జ్​కి లోబడి ఉన్నందున మూడు నూనెలపై మొత్తం దిగుమతి సుంకం 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెరిగింది.

రిఫైన్డ్ పామాయిల్, రిఫైన్డ్ సోయా ఆయిల్, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనె దిగుమతులపై 13.75 శాతం సుంకం ఉండగా, ఇప్పుడు 35.75 శాతం దిగుమతి సుంకాన్ని కేంద్రం విధించింది.

ఈ ఏడాది చివరిలో మహారాష్ట్రలో జరగనున్న ప్రాంతీయ ఎన్నికలకు ముందు సోయాబీన్ రైతులకు సహాయపడటానికి వెజిటేబుల్​ ఆయిల్​పై​ దిగుమతి పన్నులను పెంచాలని భారతదేశం పరిశీలిస్తోందని ఆగస్టు చివరలో రాయిటర్స్ నివేదించింది. అందుకు తగ్గట్టుగానే తాజాగా ప్రకటన వెలువడింది.

చాలా కాలం తర్వాత వినియోగదారులు, రైతుల ప్రయోజనాలను సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెజిటబుల్ ఆయిల్ బ్రోకరేజ్ సంస్థ సన్విన్ గ్రూప్ సీఈఓ సందీప్ బజోరియా అన్నారు. సోయాబీన్, రాప్సీడ్ పంటలకు ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరను రైతులు పొందే అవకాశం ఈ చర్యతో పెరిగిందన్నారు.

దేశీయ సోయాబీన్ ధరలు 100 కిలోలకు సుమారు 4,600 రూపాయలు (54.84 డాలర్లు) ఉన్నాయి. ఇది ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 4,892 రూపాయల కంటే తక్కువ.

భారతదేశం తన వంటనూనె డిమాండ్​లో 70% పైగా దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయ్​లాండ్​ల నుంచి పామాయిల్​ను కొనుగోలు చేస్తుండగా, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్​ల నుంచి సోయా, పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకుంటోంది.

“భారతదేశం వంట నూనె దిగుమతులు 50% కంటే ఎక్కువ పామాయిల్​ని కలిగి ఉన్నాయి. కాబట్టి భారత సుంకం పెంపు వచ్చే వారం పామాయిల్ ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది,” అని దిల్లీకి చెందిన గ్లోబల్ ట్రేడ్ హౌస్ డీలర్ చెప్పారు.

సంబంధిత కథనం