Train ticket Booking: ఈ యాప్ తో ఆన్ లైన్ లో రైలు టికెట్లు బుక్ చేసుకోవడం చాలా ఈజీ.. జనరల్ టికెట్స్ కూడా కొనేయొచ్చు..
Train ticket Booking: భారతీయ రైల్వే మెరుగైన అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) యాప్ ను ప్రవేశపెట్టింది. ఇది ప్రయాణీకులకు రైలు టికెట్లను బుక్ చేయడానికి అంతరాయం లేని సరళమైన మార్గాన్ని అందిస్తుంది.
Train ticket Booking with UTS app: నేటి డిజిటల్ యుగంలో, భారతీయ రైల్వే మెరుగైన అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS) యాప్ ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తోంది. ఈ యాప్ ద్వారా రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద పొడవాటి క్యూల సమస్యను తప్పించుకోవచ్చు. అంతేకాదు, ట్రైన్ సమయం మించి పోయినప్పుడు, టికెట్ కొనే ప్రక్రియలో ట్రైన్ ను మిస్ అయ్యే ప్రమాదం నుంచి కూడా తప్పించుకోవచ్చు.
UTS యాప్ ఎలా యాక్సెస్ చేయడం..
ఈ యూటీఎస్ (UTS app) యాప్ ను మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లోని యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత మీ మొబైల్ నెంబర్, పేరు, పాస్వర్డ్, జెండర్, పుట్టిన తేదీ వంటి అవసరమైన వివరాలను అందించడం ద్వారా అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి. విజయవంతంగా అకౌంట్ ను నమోదు చేసిన తరువాత, జీరో-బ్యాలెన్స్ ఆర్-వాలెట్ తో పాటు లాగిన్ క్రెడెన్షియల్స్ తో కూడిన ఎస్ఎంఎస్ మీకు అందుతుంది.
'క్యూఆర్ బుకింగ్', ‘క్విక్ బుకింగ్’
యూటీఎస్ యాప్ (UTS app) హోమ్ స్క్రీన్ లో 'క్యూఆర్ బుకింగ్', 'క్విక్ బుకింగ్', 'ప్లాట్ఫామ్ టికెట్' వంటి వివిధ ఆప్షన్లు కనిపిస్తాయి. టికెట్ బుకింగ్ కోసం వినియోగదారులు 'నార్మల్ బుకింగ్' ట్యాబ్ కు నావిగేట్ చేయాలి. అక్కడ వారు 'బుక్ & ట్రావెల్ (పేపర్ లెస్)' మరియు 'బుక్ & ప్రింట్ (పేపర్)' అనే రెండు మోడ్ లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మీరు పేపర్ లెస్ టికెట్ బుకింగ్ కావాలనుకుంటే మీ మొబైల్ లోని జీపీఎస్ ను ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అయితే పేపర్ మోడ్ ఎంచుకుంటే జీపీఎస్ యాక్టివేషన్ అవసరం లేదు. ఎంచుకున్న విధానంతో సంబంధం లేకుండా, బుకింగ్ ప్రక్రియ సరళంగా ఉంటుంది. మీరు మీ ప్రయాణానికి సంబంధించిన డిపార్చర్, గమ్యస్థాన స్టేషన్లను ఇన్ పుట్ చేసి, పేమెంట్ పేజీకి వెళ్లడానికి 'గెట్ ఫేర్' పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా 'నెక్ట్స్ ట్రైన్స్'ను ఎంచుకోవడం ద్వారా ఎంచుకున్న గమ్యస్థానానికి తదుపరి అందుబాటులో ఉన్న రైళ్ల సమాచారం కూడా లభిస్తుంది.
యూటీఎస్ యాప్ లో పేమెంట్ ఎలా?
యూటీఎస్ యాప్ (UTS app) లో ఆర్ వాలెట్, డెబిట్ కార్డు, యుూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి వివిధ ఆన్ లైన్ చెల్లింపు పద్ధతుల్లో దేని ద్వారా అయినా టికెట్ చార్జిని చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత, పేపర్ లెస్ టికెట్ తక్షణమే జనరేట్ అవుతుంది. అయితే పేపర్ మోడ్ టికెట్ కావాలనుకుంటే రైల్వే స్టేషన్ లోని ప్రత్యేక యూటీఎస్ కియోస్క్ లేదా బుకింగ్ కౌంటర్ నుండి తీసుకోవచ్చు.