Honda Activa EV : మార్కెట్‌లోకి రానున్న హోండా యాక్టివా ఈవీ.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెద్ద దెబ్బ!
Honda Activa EV : హోండా యాక్టివాకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇదే మోడల్‌లో యాక్టివా ఈవీ రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది.
స్కూటీల్లో హోండా యాక్టివాది ప్రత్యేకమైన స్థానం. చాలా మంది ఈ స్కూటీలను ఇష్టపడుతుంటారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు కస్టమర్లు పెరుగుతుండటంతో యాక్టివాను కూడా ఈవీగా తీసుకురావాలని కంపెనీ అనుకుంటున్నట్టుగా వివరాలు బయటకు వచ్చాయి.
వచ్చే ఏడాది లాంచ్
హోండా టూ-వీలర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన సమాచారాన్ని పంచుకున్నారు. తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శనకు వస్తుందని భావిస్తున్నట్టుగా చెప్పారు. 'ఈ ప్రదర్శన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో మా మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించాలని మేము ప్లాన్ చేస్తున్నాము. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తున్న మాట వాస్తవమే అయినా, మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా టైమింగ్ ఉంది.' అని ఆయన చెప్పారు.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ గత ఏడాది మొత్తం మార్కెట్‌లో 5 శాతం నుంచి ప్రస్తుతం 8 శాతానికి విస్తరిస్తున్నందున, ఈ విభాగంలోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయమని యోగేష్ మాథుర్ అన్నారు. 2030 నాటికి దేశీయ విక్రయాల్లో మూడో వంతు ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
ఎలక్ట్రిక్ యాక్టివా పేరుతోనేనా?
హోండా యాక్టివా పేరుకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. దీనికి ఇప్పటికీ మంచి విక్రయాలు లభిస్తుండటంతో అదే పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి హోండా తన టెక్నాలజీతో పూర్తి చేసి యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2025లో భారతదేశంలో విడుదల చేయవచ్చు.
ఇప్పటికే స్థిర బ్యాటరీ, మోటార్లు, కంట్రోలర్లు, ఛార్జర్‌లతో సహా EV టెక్నాలజీ కోసం పేటెంట్‌ను దాఖలు చేసింది. కొత్త హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫ్లోర్‌బోర్డ్ కింద స్థిరమైన బ్యాటరీ, వెనుకవైపు హబ్ మోటార్ ఉంటుందని పేటెంట్‌లు సూచిస్తున్నాయి.
వీటిపై ఎఫెక్ట్
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెరుగైన శ్రేణి, మెరుగైన ఫీచర్లు, ఆధునిక డిజైన్‌తో కూడిన Activa ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేస్తే Ola, Ether వంటి అన్ని EV స్కూటర్‌లకు పెద్ద దెబ్బ తగులుతుంది. దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఎలాంటి లోపాలు కనిపించకుంటే, దీని విక్రయాలు భారీగా పెరుగుతాయి. కొత్త హోండా యాక్టివా EV మోడల్ భారత మార్కెట్లో ఈథర్ 450X, Ola, TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.