Honda cars prices hike: హోండా సిటీ, అమేజ్ కార్ల ధరలు పెరిగాయి.. ప్రస్తుతం వాటి ధర ఎంతంటే?
ప్రీమియ కార్ల తయారీ సంస్థ హోండా.. భారత్ లో తన సెడాన్ కేటగిరీలోని హోండా సిటీ (City), అమేజ్ (Amaze) కార్ల ధరలను పెంచింది. ఇటీవల హోండా భారత్ మార్కెట్లో ఎలివేట్ ఎస్యూవీ (Elevate SUV) ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
భారత్ లో పండుగ సీజన్ సమీపిస్తోంది. పండుగ సీజన్ లో సాధారణంగా వాహనాల అమ్మకాలు పెరుగుతాయి. అందుకే, వాహన తయారీ సంస్థలు పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త మోడల్స్ ను లాంచ్ చేస్తుంటాయి. అలాగే, తమ వాహన శ్రేణి పై డిస్కౌంట్లను, కొత్త ఆఫర్లను ప్రకటిస్తుంటాయి.
హోండా అమేజ్..
తాజాగా, సిటీ, అమేజ్ మోడల్స్ ధరలను పెంచుతూ హోండా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మోడల్స్ లోని అన్ని వేరియంట్లకు ఈ పెంపు వర్తిస్తుంది. గరిష్టంగా రూ. 7900 వరకు ఈ పెంపు ఉంటుంది. ఉత్పత్తి వ్యయం అనూహ్యంగా పెరగడం వల్ల ధరలను పెంచక తప్పడం లేదని, సెప్టెంబర్ లో కార్ల ధరలు పెంచుతామని హోండా ఇటీవల ప్రకటించింది. హోండా అమేజ్ లో మెటాలిక్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్ ఉన్న వేరియంట్లపై రూ. 6900, సాలిడ్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్ ఉన్న వేరియంట్లపై రూ. 4900 మేరకు ధరను పెంచారు. తాజా పెంపు అనంతరం, హోండా అమేజ్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 7.10 లక్షల నుంచి రూ. 9.71 లక్షల మధ్య ఉంటుంది.
హోండా సిటీ
హోండా సిటీ మోడల్ ధరను కూడా పెంచారు. మెటాలిక్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్ ఉన్న వేరియంట్లపై రూ. 7900, ఇతర వేరియంట్లపై రూ. 5900 మేరకు ధరను పెంచారు. తాజా పెంపు అనంతరం, హోండా సిటీ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ. 11.63 లక్షల నుంచి రూ. 16.02 లక్షల మధ్య ఉంటుంది. హైబ్రిడ్ వేరియంట్ల ధరను పెంచలేదు. హోండా సిటీ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. హోండా అమేజ్ 1.2 లీటర్ ఐ వీటెక్ నాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది.