Honda Activa Electric Scooter: హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యేది అప్పుడే: వివరాలు ప్రకటించిన సీఈవో
Honda Activa Electric Scooter: తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురానున్నట్టు హోండా అధికారికంగా ప్రకటించింది. లాంచ్‍తో పాటు మరిన్ని వివరాలను ఆ కంపెనీ ఇండియా సీఈవో వెల్లడించారు.
Honda Activa Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ హోండా (Honda) కూడా అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే పెట్రోల్ బైక్‍లు, స్కూటర్లలో దూసుకుపోతున్న హోండా.. ఇక ఎలక్ట్రిక్‍లోనూ ప్రవేశిస్తోంది. ఈ విషయాన్ని హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (HMSI) ఎండీ, సీఈవో అత్సుషి ఒగాతా (Atsushi Ogata) అధికారికంగా వెల్లడించారు. తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ గురించి చెప్పారు. వచ్చే ఏడాది (2024) మార్చి నాటికి హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‍లోకి తీసుకొస్తామని చెప్పారు. ఎంతో పాపులర్ అయిన యాక్టివా పేరుతోనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హోండా తీసుకొస్తుందని తెలుస్తోంది.
ఇండియాకు సూటయ్యేలా..
Honda Electric Scooter: దేశంలో చార్జింగ్ ఇన్‍ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ప్లాన్ రూపొందించుకున్నట్టు హోండా ఇండియా సీఈవో ఒగాతా చెప్పారు. భారత మార్కెట్‍కు సూటయ్యేలా ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తామని అన్నారు. “మార్చి 2024లో తొలి ఎలక్ట్రిక్ మోడల్‍ను లాంచ్ చేయాలని మేం ప్లాన్ చేసుకున్నాం. ఇండియన్ మార్కెట్‍కు సూటయ్యేలా పూర్తిగా కొత్త ప్లాట్‍ఫామ్ ఆధారంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందిస్తున్నాం” అని ఒగాతా అన్నారు. హోండా యాక్టివా 6జీ హెచ్-స్మార్ట్ మోడల్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాలను ఆయన పంచుకున్నారు.
Honda Electric Scooter: మరిన్ని వివరాలు
హోండా నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీతో రానుంది. ఇక రెండో మోడల్ స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీతో వస్తుందని ఒగాతా స్పష్టం చేశారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం దేశవ్యాప్తంగా 6,000 ఔట్‍లెట్లను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కాగా, హోండా నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. వచ్చే ఏడాది మార్చిలో రానుండగా.. అనంతరం సేల్‍కు కూడా త్వరగా వస్తుందని అంచనా.
హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఒగాతా స్పష్టం చేశారు. అయితే రేంజ్ గురించి వెల్లడించలేదు.
ప్రస్తుతం ఇండియాలో ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా, హీరో, టీవీఎస్‍తో పాటు మరిన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‍లో ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. వీటికి పోటీగా హోండా వచ్చే ఏడాదిలో ఎలక్ట్రిక్ విభాగంలో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం పెట్రోల్ స్కూటర్ల విభాగంలో హోండా మార్కెట్ షేర్ 56 శాతంగా ఉంది.
హోండా తాజాగా యాక్టివా లైనప్‍లో హెచ్-స్మార్ట్ వేరియంట్‍ను లాంచ్ చేసింది. హోండా యాక్టివా హెచ్-స్మార్ట్ ప్రారంభ ధర రూ.74,536 (ఎక్స్ షోరూమ్)గా ఉంది.
సంబంధిత కథనం