Hero Motocorp dividend: రూ. 35 డివిడెండ్ ప్రకటించిన హీరో మోటో కార్ప్
2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) అంచనాలను మించి రెండంకెల వృద్ధిని సాధించింది. ఈ Q4 లో రూ. 859 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
భారత్ లోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(Q4FY23) ఫలితాలను ప్రకటించింది. ఈ Q4 లో హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) రూ. 858.93 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (Q4FY22) సంస్థ సాధించిన రూ. 627.05 కోట్ల నికర లాభాల కన్నా 36.97% అధికం. అలాగే, Q3FY23 లో హీరో మోటో కార్ప్ రూ. 711.06 కోట్ల లాభాలను ఆర్జించింది. అంటే Q3FY23 కన్నా Q4FY23 లో సంస్థ 20.79% అధిక లాభాలను ఆర్జించింది.
Hero MotoCorp dividend: డివిడెండ్
ఆదాయంలో కూడా హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) మెరుగైన ఫలితాలను సాధించింది. Q4FY23 లో సంస్థ రూ. 8,306.78 కోట్ల ఆదాయం సాధించింది. మార్చి 31, 2023తో ముగిసే ఈ Q4FY23 లో హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) మొత్తం 12.70 లక్షల వాహనాలను అమ్మగలిగింది. Q4 ఫలితాల (Q4 results) తో పాటు హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) తమ షేర్ హోల్డర్లకు ఫైనల్ డివిడెండ్ (dividend) ను కూడా ప్రకటించింది. రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 35 (1750%) ల డివిడెండ్ అందించనున్నట్లు తెలిపింది. షేర్ హోల్డర్లకు ఈ డివిడెండ్ మొత్తాన్ని 2023, సెప్టెంబర్ 8వ తేదీలోగా చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఈ ఫిబ్రవరిలోనే హీరో మోటో కార్ప్ తమ షేర్ హోల్డర్లకు రూ. 65 లను మధ్యంతర డివిడెండ్ (interim dividend) గా అందించిన విషయం తెలిసిందే. మొత్తంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 100 డివిడెండ్ (dividend) గా లభించింది. గురువారం బీఎస్ఈ లో హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) షేర్ వ్యాల్యూ 0.43% పెరిగి రూ. 2,514.05 వద్ద ముగిసింది.