DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త; డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
DA hike: దసరా పండుగ సందర్భంగా కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. చాన్నాళ్లుగా ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై ప్రకటన చేసింది.
DA hike: కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (Dearness Allowance DA) ను మరో 4% పెంచడానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో ఇప్పటి వరకు 42% గా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ.. 46 శాతానికి పెరుగుతుంది. ఈ డీఏ పెంపు జులై 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
చాన్నాళ్లుగా ఊరిస్తూ..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ను కేంద్ర ప్రభుత్వం 3% లేదా 4% పెంచబోతోందన్న వార్తలు గత వారం, 10 రోజులుగా వస్తున్నాయి. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం దసరా లోపే ప్రకటిస్తుందని కొందరు, దీపావళి వరకు ప్రకటించకపోవచ్చని మరి కొందరు అంచనా వేశారు. అయితే, దసరా ముందే కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ శుభవార్త తెలిపింది. అలాగే, 3% కాకుండా, 4% డీఏ పెంపు ఉంటుందని డబుల్ ధమాకా శుభవార్త తెలిపింది. ఏడవ పే కమిషన్ సిఫారసుల మేరకు ఈ డీఏ పెంపును ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీఏ పెంపు నిర్ణయం 48.67 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 67.95 లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. అంటే, దాదాపు 1.1 కోట్ల మందికి ఈ డీఏ పెంపుతో ప్రయోజనం కలుగుతుంది. పెన్షనర్లకు ఇచ్చే కరువు భత్యాన్ని డీఆర్ (Dearness Relief - DR) అంటారు.
ఎలా లెక్కిస్తారు?
ఈ డీఏ పెంపు ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా ఉంటుంది. కనీస వేతనంపై డీఏ ను గణిస్తారు. కార్మికులకు సంబంధించిన వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index for Industrial Workers - CPI-IW) ఆధారంగా డీఏ ను ఎంత పెంచాలనేది నిర్ణయిస్తారు. ఈ సీపీఐ ఐడబ్ల్యూ (CPI-IW) ని ప్రతీ నెల కేంద్ర కార్మిక విభాగం గణిస్తుంది. ఈ డీఏ పెంపు జులై 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అక్టోబర్ నెల వరకు ఏరియర్స్ గా చెల్లిస్తారు. నవంబర్ నుంచి వేతనంలో భాగంగా అందుతుంది. ఈ డీఏ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై సంవత్సరానికి రూ. 12,867 కోట్ల భారం పడుతుంది.
4% పెంపు ప్రకారం..
డీఏ ను బేసిక్ సాలరీ ఆధారంగా గణిస్తారు. ఉదాహరణకు బేసిక్ సాలరీ కనిష్టంగా రూ. 18 వేలు ఉంటే, ఆ వేతనంపై ప్రస్తుతం ఉన్న 42% డీఏ ప్రకారం, రూ. 7560 లభిస్తాయి. డీఏ ను 46 శాతానికి పెంచినందువల్ల, ఆ మొత్తం రూ. 8,280 కి పెరుగుతుంది. అలాగే, గరిష్ట బేసిక్ సాలరీ రూ. 56,900 పై 42% డీఏ ను గణిస్తే, రూ. 23,898 డీఏ గా లభిస్తుంది. వారికి డీఏ ను 46 శాతానికి పెంచినందువల్ల, ఆ మొత్తం రూ. 26,174 కి పెరుగుతుంది.