Budget 2024: బడ్జెట్ లో ఆర్థిక మంత్రి చెప్పిన ‘లఖ్ పతి దీదీ’ పథకం ఏమిటి?.. ఎవరికి ఉపయోగం?
Lakhpati Didi scheme: 2024 మధ్యంతర బడ్జెట్ లో కొత్త పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఏడాదికి కనీసం లక్ష రూపాయల స్థిరమైన ఆదాయాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'లఖ్ పతి దీదీ (Lakhpati Didi)' పథకాన్ని ప్రారంభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన మధ్యంతర బడ్జెట్ (budget) ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
స్వయం సహాయక సంఘాలు
దేశ వ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది మహిళలు సభ్యులుగా 83 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇవి సాధికారత, స్వావలంబనతో గ్రామీణ సామాజిక ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. వారి విజయం ఇప్పటికే దాదాపు కోటి మంది మహిళలు లక్షాధికారులుగా మారడానికి దోహదపడింది. ఈ విజయంతో లఖ్ పతి దీదీ లక్ష్యాన్ని రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
'లఖ్ పతి దీదీ' కార్యక్రమం అంటే ఏమిటి?
దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు 'లఖ్ పతి దీదీ' పథకాన్ని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద మహిళలకు ప్లంబింగ్, ఎల్ఈడీ బల్బు తయారీ, డ్రోన్ల నిర్వహణ, మరమ్మతులు వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో 2 కోట్ల మంది గ్రామీణ మహిళలను లఖ్ పతి దీదీలుగా మార్చే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
మహిళలపై కీలక బడ్జెట్ ప్రకటనలు
ఈ బడ్జెట్ లో మహిళలకు మరిన్ని పథకాలను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీని అంగన్ వాడీ, ఆశా వర్కర్లందరికీ వర్తింపజేయడం అందులో ఒకటి. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో నిర్వహించే ఆరోగ్య భీమా పథకం. ఇది ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ .5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుంది.
మహిళా సాధికారత
మహిళా సాధికారతపై మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ, ‘‘10 సంవత్సరాలలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28% పెరిగింది. స్టెమ్ కోర్సులలో, బాలికలు, మహిళలు 43% ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం చేయడం, పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 1/3 సీట్లు కేటాయించడం, పీఎం ఆవాస్ యోజన కింద మహిళలకు 70 శాతానికి పైగా ఇళ్లు కల్పించడం వారి గౌరవాన్ని పెంచింది’’ అని వివరించారు.
టాపిక్