Trump shooting : ట్రంప్‌పై హత్యాయత్నం- భారీగా పెరిగిన బిట్‌కాయిన్.. కారణం ఇదే!
కొన్ని గంటల వ్యవధిలోనే బిట్‌కాయిన్ వాల్యూ భారీగా పెరిగింది! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఇందుకు కారణం! అసలు విషయం ఏంటంటే..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నం ప్రపంచ దేశాల వార్తల్లో నిలిచింది. పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ర్యాలీలో ఆయనపై ఓ 20ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. వీటిన్నింటి మధ్య బిట్‌కాయిన్ సైలెంట్‌గా, భారీగా పెరిగిపోయింది! బిట్‌కాయిన్ 60,000 డాలర్లకు పైగా పెరిగింది. ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా పుంజుకున్నాయి. ట్రంప్‌పై హత్యాయత్నానికి, బిట్‌కాయిన్ పెరగడానికి కారణం ఏంటని? ఆలోచిస్తున్నారా? ఇందుకు ఓ కారణం ఉంది.
ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత బిట్‌కాయిన్ ఎందుకు పెరిగింది?
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా తాజా పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలు పెరిగాయని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఫలితంగా బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు పెరిగాయి.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ఉంటారు. గత నెలలో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక కార్యక్రమంలో "బిట్‌కాయిన్ భవిష్యత్తు, తలరాతను అమెరికాలో తయారు చేస్తాను. విదేశాలకు తరలివెళ్లకుండా నేను చూసుకుంటాను," అని ట్రంప్ చెప్పినట్లు ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. బిట్‌కాయిన్, ఎథేరియం, సోలానా, డోజ్కాయిన్, షిబా ఇను రూపంలో ట్రంప్ ప్రచార విరాళాలు స్వీకరించారని, క్రిప్టోను తమ ఆధీనంలోకి తీసుకునే హక్కుకు మద్దతు ఇచ్చారని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది.
ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వం క్రిప్టో పట్ల వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం న్యూయార్క్‌లో ఉదయం 1:05 గంటల సమయానికి బిట్‌కాయిన్ 2.7 శాతం పెరిగి 60,160.71 డాలర్లకు చేరుకుంది. డోజ్కాయిన్, సోలానా, ఎక్స్ఆర్పీ సహా మరికొన్ని క్రిప్ట్ కరెన్సీలు కూడా 5% లేదా అంతకంటే ఎక్కువ లాభపడ్డాయని సీఎన్‌బీసీ టీవీ 18 నివేదిక తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్ ప్రచార సభలో ఏం జరిగింది?
పెన్సిల్వేనియాలోని బట్లర్ ఫార్మ్ షోలో మాజీ అధ్యక్షుడు ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.
కాల్పులు జరిపిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) గుర్తించింది. భద్రతా సిబ్బంది అతడిని అక్కడికక్కడే కాల్చి చంపేశారు.
ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. ఘటనలో ఒకరు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఈ ఘటన తర్వాత తాను బాగానే ఉన్నానని, సోమవారం మిల్వాకీ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ట్రంప్ తెలిపారు.
కొన్ని దశాబ్దాలుగా గన్ కల్చర్‌తో అమెరికా సతమతమవుతోంది. 1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీని కాల్చి చంపారు. 1968లో కాలిఫోర్నియాలో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ సహా పలువురు ఎన్నికల ప్రచారంలో కాల్పులకు బలయ్యారు. 1972లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న జార్జ్ వాలెస్‌ను ప్రచార వేదికపై దుండగులు కాల్చి చంపారు. 1981లో రొనాల్డ్ రీగన్‌ను కాల్చి చంపిన ఘటన తర్వాత ఒక అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
.
సంబంధిత కథనం