Donald Trump : డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పుల కలకలం! మాజీ అధ్యక్షుడి చెవికి గాయం- లైవ్ వీడియో..
Donald Trump rally : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పుల కలకలం! ట్రంప్ చెవికి గాయమైంది. ఆయన్ని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఆందోళనకర పరిణామం! మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో భారీ శబ్దాలు వినిపించాయి. అవి తుపాకీ కాల్పుల శబ్దాలని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. కానీ ట్రంప్‌కి అప్పటికే గాయమైనట్టు తెలుస్తోంది. ఆయన చెవి నుంచి రక్తం కారుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది..
నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికెన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారీ ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఒక ర్యాలీ నిర్వహించారు. ఆయన స్టేజ్ మీదకు వచ్చిన కొద్దిసేపటికే భారీ శబ్దాలు వినిపించాయి. ఇవి తుపాకీ కాల్పుల శబ్దాలని తెలుస్తోంది. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. మరోవైపు శబ్దాల అనంతరం ట్రంప్ నేలకొరిగారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు స్టేజ్ మీదకు పరుగులు తీశారు. ఆయన్ని రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్టేజ్ దిగుతూ.. పిడికిలి బిగించిన తన చెయ్యిని పైకి చూపించారు. 'నన్ను ఎవ్వరు ఏం చెయ్యలేరు,' అన్నట్టు సైగ చేశారు ట్రంప్.
కాగా ఈ ఘటనకు సంబంధించి ర్యాలీ ప్రాంగణంలో ఇద్దరు మరణించారని, వారిలో అనుమానిత షూటర్ కూడా ఉన్నాడని అమెరికా మీడియా చెబుతోంది.
మరోవైపు ఈ వ్యవహారంపై సీక్రెట్ సర్వీస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
"మాజీ అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడు ఇది మా చేతుల్లో ఉంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాము," అని సీక్రెట్ సర్వీస్ పేర్కొంది.
ఈ ఘటనపై ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ సైతం స్పందించారు. తన తండ్రి అమెరికా కోసం పోరాడుతూనే ఉంటారని అన్నారు.
ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఖండించిన అమెరికా అధ్యక్షుడు..
డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో హింస గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అధికారులు వివరాలు ఇచ్చారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నారని చెప్పారు.
"పెన్సిల్వేనియాలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో హింసపై నాకు సమాచారం అందింది. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ట్రంప్, ఆయన కుటుంబం, ర్యాలీలో పాల్గొన్న ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నాను. అమెరికాలో ఇలాంటి హింసకు చోటు లేదు. మనం అందరం ఐకమత్యంతో ఈ ఘటనని ఖండించాలి," అని బైడెన్ ట్వీట్ చేశారు.
డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో ఘటనకు సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి :
అమెరికా మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా సైతం ఈ ఘటనపై స్పందించారు.
"ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు చోటు లేదు. అసలు ఏం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, మాజీ అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉన్నారన్న వార్త రిలీఫ్‌ని ఇస్తుంది. ఆయన వేగంగా కోలుకోవాలని నేను, మిచెల్(ఒబామా భార్య) ప్రార్థిస్తున్నాము," అని ఒబామా ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం