Apple iPhone SE 4: తదుపరి చౌక ఐఫోన్ వస్తుందా, రాదా? సందిగ్ధతకు కారణాలివే..
Apple iPhone SE 4: ఐఫోన్ ఎస్ఈ 4పై తీవ్ర సందిగ్ధత నెలకొంది. యాపిల్ ఈ మోడల్‍ను రద్దు లేదా వాయిదా వేస్తుందని అంచనాలు బయటికి వచ్చాయి.
Apple iPhone SE 4: తక్కువ ధరలో యాపిల్ ఐఫోన్ కొనాలనుకునే వారికి ఎస్ఈ (iPhone SE) మోడళ్లు మంచి ఆప్షన్‍గా ఉంటాయి. ఇప్పటి వరకు ఎస్ఈ లైనప్‍లో మూడు జనరేషన్‍ల మొబైల్స్ వచ్చాయి. ఈ ఏడాది 5జీ కనెక్టివిటీతో ఐఫోన్ ఎస్ఈ 3 (2022) లాంచ్ అయింది. తదుపరి ఐఫోన్ ఎస్ఈ 4 (4th Generation) కోసం యాపిల్ ప్లాన్ చేస్తోందని ఇటీవల సమాచారం వెల్లడైంది. 2023 లేదా 2024 ప్రారంభంలో ఈ మొబైల్ మార్కెట్‍లోకి వస్తుందని అంచనాలు వచ్చాయి. అయితే తాజాగా ఎస్ఈ 4పై సందిగ్ధత నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ యాపిల్ ఎనలిస్ట్ మింగ్-చి కువో (Ming-Chi Kuo) ఈ విషయాన్ని వెల్లడించారు. ఐఫోన్ ఎస్ఈ 4పై యాపిల్ పునరాలోచన చేస్తోందని ఆయన తెలిపారు. కారణాలను కూడా వెల్లడించారు. వివరాలివే..
డిమాండ్‌పై ఆందోళన
Apple iPhone SE 4: “ఐఫోన్ ఎస్ఈ 4ను యాపిల్ రద్దు చేస్తుంది లేదా మాస్ ప్రొడక్షన్‍ను 2024కు వాయిదా వేస్తుంది” అని మింగ్-చి కువో ట్వీట్ చేశారు. ఐఫోన్ లో-ఎండ్ (Low-end) మోడళ్లకు డిమాండ్ తక్కువగా ఉంటుండటంతో తదుపరి ఎస్ఈ జనరేషన్ గురించి యాపిల్ పునరాలోచనలో పడిందని ఆయన పేర్కొన్నారు. ఐఫోన్ ఎస్ఈ 3, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 14 ప్లస్ లాంటి మొబైళ్లను అందుకు ఉదాహరణగా మింగ్-చు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మూడు మోడళ్ల అమ్మకాలు యాపిల్ ఆశించిన స్థాయిలో లేవు.
ఐఫోన్ ఎక్స్ఆర్‌ను పోలి ఉండేలా ఫుల్ స్క్రీన్ డిజైన్‍తో ఐఫోన్ ఎస్ఈ 4 (iPhone SE 4)ను తీసుకురావాలని యాపిల్ భావించింది. అయితే, ఈ ప్లాన్ కారణంగా అమ్మకం ధర కంటే.. ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అవుతుందని యాపిల్ ఇప్పుడు పునరాలోచనలో పడిందని మింగ్-చు అన్నారు. వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం ఉంటుందని అంచనాలు వస్తుండటంతో ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాలని యాపిల్ అనుకుంటోందని ఆయన వెల్లడించారు. ఈ కారణంగా యాపిల్ ఎస్ఈ 4 మోడల్‍ను యాపిల్ రద్దు చేసుకోవడమో లేదా ప్రొడక్షన్‍ను 2024కు వాయిదా వేయడమో చేస్తుందని అంచనా వేశారు.
ఐఫోన్ 14 ప్రో మోడళ్లకు కరోనా కష్టాలు
iPhone 14 Pro Models: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ 14 ప్రో మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే చైనాలో కొవిడ్-19 (Covid-19) విజృంభిస్తుండటంతో అక్కడి ఫాక్స్‌కాన్ (Foxconn) ప్లాంట్‍లో ఐఫోన్‍ల ఉత్పత్తి చాలా ఆలస్యం అవుతోంది. దీంతో ఐఫోన్ 14 మోడళ్ల షిప్‍మెంట్లు బాగా తగ్గిపోయాయి. ఐఫోన్ 14 ప్రో కోసం కస్టమర్లు ఎక్కువ కాలం వేచిచూడాల్సి రావొచ్చు అంటూ యాపిల్ ఇటీవల అధికారంగానే సంకేతాలు ఇచ్చింది.