Bollywood Stars Investment : బాలీవుడ్ స్టార్స్ రియల్‌ఎస్టేట్, రెసిడెన్షియల్‌లో ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు?
Bollywood Stars Investment : ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటులు రియల్ఎస్టేట్, కమర్షియల్ రెసిడెన్షియల్‌లో పెట్టుబడి పెడుతున్న వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి పెట్టబడులు ఊహించని లాభాలను ఇస్తాయి. నెలవారీ ఆదాయం వస్తూనే ఉంటుంది.
ఆర్థికవేత్తలు ఎప్పుడూ చెప్పేమాట.. కేవలం ఒక ఆదాయ వనరుపై ఆధారపడకూడదు. మరికొన్నింటిని కూడా చూడాలి. కష్ట సమయాల్లో అవే మనల్ని ఆదుకుంటాయి. అందుకే ఫన్నీగా ఓ మాట ఉంటుంది. గుడ్లు అన్ని ఒకే సంచిలో పెట్టకూడదు. ఎందుకంటే.. కిందపడితే పగిలిపోయి అన్నీ నాశనం అవుతాయి. అలానే ఒకే ఆదాయం మీదనే ఆధారపడొద్దు. అక్కడ నుంచి డబ్బులు రాకపోతే వేరే మార్గం కనిపించదు. బాలీవుడ్ స్టార్స్ ఇదే సూత్రం ఎక్కువగా పాటిస్తుంటారు. కేవలం సినిమాలే కాదు.. ఇతర ఆదాయాలపైనా కన్నేస్తారు.
చాలా మంది తారలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉందని నమ్ముతున్నారు. ఇటీవల బాలీవుడ్ సింగర్ అయిన రాహుల్ వైద్య ముంబైలో రూ.9 కోట్లు పెట్టి ఓ అపార్ట్‌మెంట్ తీసుకున్నాడు. అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్లు ఇలా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే కొందరు సెంటిమెంట్ కారణంగా కూడా ఆస్తిని కొనుగోలు చేస్తారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నా్రు. చాలా మంది బాలీవుడ్ తారలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం మామూలే. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమైనప్పుడు పెట్టుబడి పెట్టడానికి చూస్తారు.
దీనికి ప్రధాన కారణం వారు ఆ ఆస్తిని ఉపయోగించుకోవచ్చు. తమ డబ్బును వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా సంపాదన పెంచుకోవచ్చు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను ఆదా అవుతుంది. ముంబైలోని లగ్జరీ ప్రాజెక్ట్‌లలో అపార్ట్‌మెంట్లు కొనుక్కుని చాలా మంది బాలీవుడ్ తారలు వార్తల్లోకెక్కడం చూస్తుంటాం. బాంద్రా, ఖార్, అంధేరీస్ లోఖండ్‌వాలా, వర్లీ వంటి ప్రాంతాల్లో ఉన్న అనేక భవనాలు సినిమా తారలకు ఇష్టమైన రియల్ ఎస్టేట్ కొనుగోలు ప్రదేశాలు.
రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు వారి ఉద్దేశాలు పెట్టుబడి, అద్దె, ఉపయోగం, సెంటిమెంట్ వంటి కారణాలు. బాలీవుడ్ తారలు ప్రాజెక్ట్ లాంచ్ దశలో లేదా ఆస్తి దాదాపుగా పూర్తి అయిన తర్వాత పెట్టుబడి పెడతారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్టాక్ మార్కెట్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తన అదృష్టాన్ని చాలాసార్లు చూసుకున్నాడు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ముంబైలోని ములుండ్ ప్రాంతంలో ఒబెరాయ్ ఎటర్నియా అనే ప్రాజెక్ట్‌లో రూ.24.95 కోట్లు పెట్టుబడి పెట్టారు. 10 అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ట్ తీసుకునే ఆస్తులు వాణిజ్య భవనాలకు కూడా ఉపయోగిస్తుంటారు. అమితాబ్ బచ్చన్, మనోజ్ బాజ్‌పేయి, సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అజయ్ దేవగన్ వంటి పలువురు ఇప్పటికే ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని సిగ్నేచర్ భవనంలో వాణిజ్య స్థలాలను కొనుగోలు చేశారు. అద్దె ఆదాయం కోసం అనేక ఆస్తులపై దృష్టి సారిస్తున్నారు. ఇతర సెలబ్రెటీలు కోట్ల అద్దె ఇచ్చి ఉంటున్న వార్తలు చూస్తూనే ఉన్నాం.
2020-2024 మధ్య రియల్ ఎస్టేట్‌లో రూ.194 కోట్ల పెట్టుబడులతో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అగ్రస్థానంలో ఉన్నారు. జాన్వీ కపూర్ 169 కోట్లు పెట్టుబడి పెడితే రణవీర్ సింగ్, దీపికా పదుకొనే రియల్ ఎస్టేట్‌లో 156 కోట్లు పెట్టుబడి పెట్టారు. స్క్వేర్యార్డ్స్ సేకరించిన డేటా ప్రకారం అజయ్ దేవగన్, కాజోల్ రూ.110 కోట్లు, షాహిద్ కపూర్ రూ.59 కోట్లు పెట్టారు.
బాలీవుడ్ నటి కృతి సనన్ జూలైలో ముంబైకి సమీపంలోని అలీబాగ్‌లో 2,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేసింది. గత కొన్ని నెలలుగా పలువురు బాలీవుడ్ తారలు ముంబైలో వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయడం లేదా అధిక అద్దెకు వాటిని లీజుకు ఇస్తున్నారు. గత ఏడాది ఓషివారాలో దాదాపు రూ.7 కోట్లతో నాలుగు వాణిజ్య యూనిట్లను కొనుగోలు చేసిన అమితాబ్ బచ్చన్, ఏడాదికి రూ.2.07 కోట్లకు ఆస్తిని అద్దెకు తీసుకున్నారు.
బచ్చన్‌తో పాటు, నటులు కార్తీక్ ఆర్యన్, మనోజ్ బాజ్‌పేయి, సారా అలీ ఖాన్, కాజోల్ గత సంవత్సరం అంధేరీ వెస్ట్‌లోని లోటస్ సిగ్నేచర్ టవర్‌లో కార్యాలయ స్థలాలను కొనుగోలు చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో సోను నిగమ్ అంధేరిలో 5,547 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.11.37 కోట్లతో రెండు వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేసినట్లు ప్రాప్‌స్టాక్ షేర్ చేసిన రికార్డులు ఇంతకు ముందు చూపించాయి.
ఇలా రియల్‌ఎస్టేట్, కమర్షియల్ రెసిడెన్షియల్ మీద బాలీవుడ్ నటులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. తద్వారా స్థిరమైన ఆదాయం సంపాదిస్తున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రియల్‌ఎస్టేట్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు.