2022 Stock market recap : కొంచెం నవ్వు.. కొంచెం బాధ- దలాల్ స్ట్రీట్ @2022
2022 stock market recap : 2022 ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దలాల్ స్ట్రీట్‌లో నెలకొన్న పరిస్థితులు, సూచీలు సాగించిన ప్రయాణాన్ని ఓసారి చూద్దాము..
2022 stock market recap : దలాల్ స్ట్రీట్‌లో మదుపర్లకు ఈ ఏడాది 'కొంచెం నవ్వు- కొంచెం బాధ'ను మిగిల్చింది! 2022లో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకలకు లోనయ్యాయి. అంతర్జాతీయ పరిస్థితుల మధ్య తీవ్రంగా నష్టపోయినా ప్రతీసారి.. రెట్టింపు ఉత్సాహంతో పైకి లేచాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా 'బేర్' మార్కెట్లపై కథనాలు వెలువడితే.. దలాల్ స్ట్రీట్ మాత్రం ఆల్ టైమ్ హై రికార్డులు సృష్టించింది.
ఈ ఏడాది.. సెన్సెక్స్, నిఫ్టీలు నమోదు చేసి కనిష్ఠ- గరిష్ఠ లెవల్స్, మార్కెట్లను ప్రభావితం చేసిన అంశాలను ఓసారి చూద్దాం..
టెక్నికల్స్ (2022 డిసెంబర్ 20 నాటికి)..
టెక్నికల్స్ విషయానికొస్తే.. 2022లో డిసెంబర్ 20 నాటికి సెన్సెక్స్ 3.4శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఈ ఏడాది ట్రేడింగ్ సెషన్‌ను 59,200 లెవల్స్ వద్ద ప్రారంభించిన సెన్సెక్స్.. జులై 17న 51,360.42 లెవల్స్ వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. అక్కడి నుంచి నిదానంగా తేరుకుని.. 63,583.07 వద్ద డిసెంబర్ 1న గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది.
Sensex in 2022 : మరోవైపు నిఫ్టీ50.. ఈ ఏడాది ట్రేడింగ్ సెషన్‌ను 17,620 లెవల్స్ వద్ద ప్రారంభించింది. జులైలో 17న 15,183 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. అక్కడి నుంచి నిదానంగా పెరుగుతూ.. డిసెంబర్ 1న 18,887 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ ప్రక్రియ నమోదైంది.
గతేడాది అక్టోబర్‌లో ఆల్ టైమ్ హైని నమోదు చేసిన దేశీయ సూచీలు.. చివరి మూడు నెలల్లో పడ్డాయి. ఈ ఏడాది కూడా దాదాపు నష్టాల్లోనే ఉన్నాయి. నవంబర్‌లో తేరుకుని ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేశాయి.
స్టాక్ మార్కెట్‌ను కుదిపేసిన అంశాలివే..
Nifty recap 2022 : ఈ ఏడాది.. జాతీయ అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లను పెద్దగా ప్రభావితం చేయలేదు అనే చెప్పుకోవాలి. కానీ అంతర్జాతీయ పరిణామాలు మాత్రం దలాల్ స్ట్రీట్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, మాంద్యం వంటి పదాలు ఈ ఏడాది చాలా ఎక్కువగా వినిపించాయి.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం..
Russia Ukraine war : కొవిడ్ సంక్షోభంతో విలవిలలాడిన ప్రపంచం.. 2021 చివరి దశ నుంచి కోలుకునే ప్రక్రియ మొదలుపెట్టింది. అప్పటికే దారుణంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఫిబ్రవరిలో.. రష్యా మరో బాంబు పేల్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి, ఆ దేశంలోకి చొచ్చుకెళ్లింది. ఈ పరిణామాలు ఒక్క ఉక్రెయిన్‌పైనే కాకుండా.. ప్రపంచంపైనా తీవ్ర ప్రభావం చూపించాయి. సప్లై చెయిన్ వ్యవస్థ మరోమారు దెబ్బతింది. మదుపర్ల మధ్య నెలకొన్న భయంతో స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. యుద్ధం భయాల మధ్య ఫిబ్రవరిలో నిఫ్టీ.. 17577 నుంచి 16,248 వరకు పతనమైంది.
ఫెడ్ రేట్ హైక్.. మాంద్యం
కొవిడ్‌తో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అది తారస్థాయికి చేరింది. మండిపోతున్న ధరలతో ప్రజలు అల్లాడిపోయారు. అమెరికాలో 40ఏళ్ల రికార్డుస్థాయికి ద్రవ్యోల్బణం చేరుకుంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితులు కనిపించాయి. ఇంధన సంక్షోభంతో యూరోప్ వణికిపోయింది.
US FED rate hike : ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ బ్యాంక్‌లు రంగంలోకి దిగాయి. మొదటిగా.. అమెరికా ఫెడ్.. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది. దాదాపు 2-3 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మార్చ్‌లో వడ్డీ రేట్లను పెంచింది. ఆ సమయంలో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే అంతర్జాతీయ మార్కెట్లు కూడా పతనమయ్యాయి.
ఇక దలాల్ స్ట్రీట్ విషయానికొస్తే.. ఫిబ్రవరి 28న 16,794 వద్ద ఉన్న నిఫ్టీ50 మార్చ్ 17 నాటికి 15,863కి పడిపోయింది.
Investment in US Stock markets : ఈ సమయంలో ప్రపంచానికి మరో షాక్ తగిలింది! ఇటు ఫెడ్‌తో పాటు ప్రపంచ బ్యాంక్‌లు వడ్డీ రేట్ల తీవ్రతను విపరీతంగా పెంచేస్తున్నా.. అటు ద్రవ్యోల్బణం మాత్రం దిగిరాలేదు. నూతన గరిష్ఠాలను నమోదు చేస్తూనే ఉన్నాయి. వడ్డీ రేట్ల పెంపుతో తొందరగా సమస్య పరిష్కారమవుతుందనుకున్న మదుపర్లకు షాక్ తగిలింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
మదుపర్లకు కష్టాలు అప్పుడే తీరలేదు! ద్రవ్యోల్బణం కోసం వడ్డీ రేట్లు పెంచుతుండటంతో మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఇంకొన్ని వార్తలైతే.. మాంద్యం ఇప్పటికే మొదలైందని రాసుకొచ్చాయి. ఈ పరిస్థితులతో మార్కెట్లు మరింత కిందకు పడ్డాయి.
దలాల్ స్ట్రీట్ విషయానికొస్తే.. మాంద్యం భయాల మధ్య నిఫ్టీ50.. జులై 17న కనిష్ఠానికి పడిపోయింది.
అన్ని సెక్టార్లతో పోల్చుకుంటే ఐటీ రంగం దారుణంగా పతనమైంది. ఈ ఏడాదిలో ఐటీ రంగం చాలా బలహీనమైన ప్రదర్శన చేసింది. ఐటీ స్టాక్స్ ఇప్పట్లో తేరుకోకపోవచ్చు అన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి.
కొంచెం నవ్వు.. కొంచెం బాధ..
2023 India stock market outlook : ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు భారీగా పడిన మాట వాస్తవమే. కానీ అంతర్జాతీయ మార్కెట్లు, ముఖ్యంగా అమెరికా మార్కెట్లతో పోల్చుకుంటే దేశీయ సూచీలు అద్భుతమైన ప్రదర్శన చేశాయనే చెప్పుకోవాలి!
అమెరికా మార్కెట్లు దాదాపు 20శాతం మేర పతనమయ్యాయి. కానీ సెన్సెక్స్, నిఫ్టీ విషయంలో అలా జరగలేదు. కింద పడుతున్న ప్రతిసారీ.. మన సూచీలు నిలబడ్డాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో దేశాభివృద్ధి కీలకం. ఇండియాను వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచం భావిస్తుంది. అదే సమయంలో ఇండియాలో ద్రవ్యోల్బణం.. అమెరికా స్థాయిలో లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో అద్భుతంగా రాణిస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.
ఈ పరిణామాలతోనే.. అమెరికా మార్కెట్లతో పోల్చుకుంటే దలాల్ స్ట్రీట్‌లో అంత రక్తపాతం నమోదవ్వలేదు. పైగా.. ఈ ఏడాది సూచీలు ఆల్ టైమ్ హైని నమోదు చేయగా.. అమెరికా మార్కెట్లు ఇంకా సుమారు 10శాతం నష్టాల్లోనే ఉన్నాయి.
సంబంధిత కథనం