Weather Update : వాతావరణ శాఖ హెచ్చరిక.. రాగల ఐదు రోజులు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రాబోయే.. ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
సీజన్ ప్రారంభంలో ఉత్తర కోస్తా ఆంధ్రాలో వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత మిగిలిన కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో మెల్లగా విస్తరిస్తుంది. ఈసారి ముందుగానే సీమలోనూ వర్షాలు కురిశాయి. కర్నూలు, కడప, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. కోస్తా ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో జూన్‌లో సరిపడా వర్షాలు కురవలేదు. వచ్చే వారం కోస్తాలో వర్షాలు పెరిగి రాయలసీమలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.
ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తూర్పు పశ్చిమ ద్రోణి.. మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అంతర్గత ఒడిశా, అక్కడ పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా దాని పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది.
టాపిక్