CBI Counter On Viveka Murder : వివేకా హత్య కేసులో సిబిఐ కౌంటర్, వెలుగులోకి సంచలన విషయాలు-viveka murder case accused bail petition and cbi appeals to reject petition of sunil yadav ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbi Counter On Viveka Murder : వివేకా హత్య కేసులో సిబిఐ కౌంటర్, వెలుగులోకి సంచలన విషయాలు

CBI Counter On Viveka Murder : వివేకా హత్య కేసులో సిబిఐ కౌంటర్, వెలుగులోకి సంచలన విషయాలు

HT Telugu Desk HT Telugu
Feb 23, 2023 06:37 AM IST

CBI Counter On Viveka Murder వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సిబిఐ అభిప్రాయపడింది. వివేకా హత్య కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని, ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం సరికాదని అభిప్రాయపడింది. వివేకా హత్య జరగడానికి కొన్ని గంటల ముందు నిందితులు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఎదురు చూశారని తెలిపింది.

వివేకా హత్య కేసు దర్యాప్తుపై సిబిఐ కౌంటర్
వివేకా హత్య కేసు దర్యాప్తుపై సిబిఐ కౌంటర్ (HT_PRINT)

CBI Counter On Viveka Murder వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. వివేకా హత్య కేసులో మరోసారి విచారణకు హాజరు కావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో బెయిల్ కోసం నిందితుడు సునీల్ యాదవ్ దరఖాస్తు చేసుకోవడంతో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. వివేకా హత్యకు ముందు సునీల్ యాదవ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని ఆరోపించింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరగడానికి కొన్ని గంటల ముందు సునీల్ యాదవ్ కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. వివేకాను హత్య చేయడానికి కదిరి నుంచి గొడ్డలి తీసుకురావడానికి వెళ్లిన దస్తగిరి కోసమే సునీల్‌యాదవ్‌ అవినాష్‌ రెడ్డి ఇంట్లో ఎదురు చూశాడని వెల్లడించింది.

2019 మార్చి 14న వివేకాతోపాటు ఉన్న ఎర్ర గంగిరెడ్డి సాయంత్రం 6.14 నుంచి 6.33 గంటల మధ్య సునీల్‌ యాదవ్‌కు రెండుసార్లు ఫోన్‌ చేశారని వెల్లడించింది. వివేకా హత్య ఘటన వెలుగులోకి రావడానికి కొంత సమయం ముందు 2019 మార్చి 15 తెల్లవారుజామున నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి తదితరులు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని కౌంటర్‌లో పేర్కొంది.

వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినప్పుడు అవినాష్‌రెడ్డి అనుచరులతో కోర్టుకు వచ్చి హల్‌చల్‌ చేశాడని, ఎంపీ అవినాష్‌రెడ్డి.. శివశంకర్‌రెడ్డికి మద్దతుగా నిలిచారని, ఆయన అనుచరులు సీబీఐకి అడ్డంకులు కల్పించారని వెల్లడించింది. శివశంకర్‌రెడ్డి కుమారుడి ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ఫ్లెక్సీల్లో అవినాష్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఫొటోలు వేసి తన వెనకున్న రాజకీయ పలుకుబడిని ప్రజలకు చెప్పాలని ప్రయత్నించారని పేర్కొంది.

పథకం ప్రకారమే హత్య….

'2019 మార్చి 14న అవినాష్‌ రెడ్డి ఇంట్లో సునీల్‌ యాదవ్‌ ఎదురుచూస్తుండగా, రాత్రి 8.30 గంటలకు దస్తగిరి వచ్చినట్లు సిబిఐ పేర్కొంది. పథకం ప్రకారం భాస్కర్‌రెడ్డి రెండు ఫోన్‌లను స్విచ్ఛాఫ్‌ చేశారని, వివేకా హత్యకు కొన్ని గంటల ముందు సునీల్‌ యాదవ్‌... భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అవినాష్‌రెడ్డి ఇంటికి, ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చాడని వివరించింది.

మార్చి 14వ తేదీ రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్య వివేకా ఇంటి సమీపంలోకి మద్యం తాగేందుకు దస్తగిరిని రమ్మని సునీల్‌యాదవ్‌ పిలిచాడు. 11.45 గంటల వరకు మద్యం తాగుతూ ఉన్న సమయంలో, వివేకా కారు ఆయన ఇంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి అర్ధరాత్రి దాటాక 1.30 గంటల వరకు మద్యం తాగుతున్న ప్రాంతంలోనే ఉన్నట్లు ఆధారాలు లభించాయని, 14వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు వెనుకవైపు కాంపౌండ్‌ దాటి వివేకా ఇంట్లోకి చేరుకోడానికి గంగిరెడ్డి సహకరించాడని సిబిఐ పేర్కొంది.

ఆ సమయంలో వారిని ఇంట్లో చూసిన వివేకా ఎందుకొచ్చారని వివేకా గట్టిగా ప్రశ్నించడంతో డబ్బు లావాదేవీలు మాట్లాడటానికి వచ్చారని గంగిరెడ్డి ఆయనకు సర్ది చెప్పాడు. కాసేపటికే సునీల్‌ యాదవ్‌ దుర్భాషలాడుతూ వివేకా ఛాతీపై కొట్టడం ప్రారంభించగా, దస్తగిరి నుంచి ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలి తీసుకుని నుదుటిపై దాడి చేయడంతో తీవ్ర గాయమైంది. ఆ తర్వాత డ్రైవర్‌ ప్రసాద్‌ తనను కొట్టినట్లు వివేకాతో బలవంతంగా లేఖ రాయించారు. అనంతరం బాత్‌రూంలోకి తీసుకెళ్లి తలవెనుక ఏడెనిమిదిసార్లు ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలితో దాడి చేశాడని సిబిఐ వివరించింది. సునీల్‌ యాదవ్‌ వివేకా మర్మాంగాలపై తన్నాడని, తర్వాత వారు అక్కడ నుంచి వెళ్లిపోయారని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో సిబిఐ వివరించింది. హత్య చేసి పారిపోతుండగా వాచ్‌మన్‌ రంగన్న నిందితులను గుర్తించారని, సాక్ష్యాలను ధ్వంసం చేయడంలోనూ శివశంకర్‌రెడ్డి పాత్ర ఉందన్నారు.

డబ్బులు ఇవ్వలేదని వివేకాపై గంగిరెడ్డికి కక్ష…

బెంగళూరులో జరిగిన సెటిల్‌మెంట్‌లో వాటా ఇవ్వలేదని గంగిరెడ్డి ఆయనపై కక్ష పెంచుకున్నాడని అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. వివేకాను చంపేయాలని తనకు చెప్పాడని, తన వెంట వారు కూడా ఉంటామని భరోసా ఇచ్చారని ఒప్పుకున్నాడు. వివేకా హత్యకు పలుకుబడి ఉన్న వ్యక్తులు మద్దతిస్తారని శివశంకర్‌రెడ్డి చెప్పాడని దస్తగిరి సిబిఐకు వివరించాడు. వివేకా ఇంట్లో ఉండే వాచ్‌మాన్‌ 13- 15 తేదీల మధ్య కాణిపాకం వెళుతున్నట్లు వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి సమాచారం ఇచ్చాడని అతను వెల్లడించాడు.

2019 మార్చి 15న శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి తదితరులు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ఇంట్లో ఉన్నారని సిబిఐ ఆరోపించింది. ఎం.వి.కృష్ణారెడ్డి వెల్లడించక ముందే హత్య సమాచారం తెలిసినా ఇతరుల ద్వారా బయటపడిన వెంటనే సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి వారు అక్కడే వేచి ఉన్నారని అభిప్రాయపడింది. సమాచారం బయటికి రాగానే వేకువజామున 5.20 గంటలకు వెళ్లి సాక్ష్యాలను ధ్వంసం చేశారని సిబిఐ తెలిపింది.

వివేకా బామ్మర్ది ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డి నుంచి ఫోన్‌ రాావడంతో అవినాష్‌రెడ్డి, శివిశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాఘవరెడ్డి, రమణారెడ్డి పీఏలు వివేకా ఇంటికి వెళ్లారని తెలిపింది. గజ్జల ఉదయకుమార్‌రెడ్డి అవినాష్‌రెడ్డి ఇంట్లో 6.25 వరకు ఉన్నారని వివేకా హత్య జరిగిన రోజు ఉదయం స్థానిక నేత కె.శశికళకు వివేకాకు గుండెపోటు వచ్చిందని అవినాష్‌రెడ్డి ఆమెకు చెప్పారు.

అవినాష్‌రెడ్డి తన ఫోన్‌ నుంచి మరో నంబరుకు కాల్‌ చేశాడని, తరువాత మరో రెండు కాల్స్‌ చేశాడని తెలిపారు. తర్వాత పీఏ రాఘవరెడ్డి ఫోన్‌తో సీఐ జె.శంకరయ్యకు కాల్‌ చేసి... వివేకా గుండెపోటుతో రక్తవాంతులు చేసుకుని చనిపోయారని, భద్రత కోసం పోలీసులను పంపాలని కోరారని వివరించింది.. ఘటనా స్థలానికి పోలీసులను పంపిన సీఐ సంఘటనా స్థలానికి చేరుకోలేదని, హత్య విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారని వివరించింది. . సహజ మరణంగా కట్టు కథ అల్లి చెప్పారని, నిందితులు సంఘటనా స్థలాన్ని శుభ్రం చేశారని, వివేకా గాయాలకు కట్టుకట్టి ఆస్పత్రికి తరలించారని పేర్కొంది.

ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సరికాదు….

వివేకా హత్య కేసులో సునీల్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించారని, ఈ దశలో బెయిలు ఇవ్వడం సరికాదని సీబీఐ అభిప్రాయ పడింది. సునీల్‌ యాదవ్‌ను వాచ్‌మన్‌ రంగన్న గుర్తించారని వెల్లడించింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి కుటుంబ సభ్యులపై దాడులు జరుగుతున్నాయని, ఈ దశలో బెయిల్ వస్తే సాక్ష్యం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారని తెలిపింది. హత్య తర్వాత సునీల్‌యాదవ్‌ గోవా పారిపోయాడని, బెయిలిస్తే తిరిగి పారిపోయే ప్రమాదం ఉందని వివరించింది. నిందితుడి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.

రాజకీయ విభేదాలే హత్యకు అసలు కారణం

వివేకానంద రెడ్డి 2013లో వివేకా కాంగ్రెస్‌ను వదిలి, వైసీపీలో చేరారు. అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ విజయమ్మపై వివేకా పోటీ చేశారు. 2014లో ఆయనకు పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే వివేకా కడప ఎంపీ సీటుకు పోటీదారుగా మారే ప్రమాదం ఉందని ప్రత్యర్థులు భావించారు. దీంతో నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు.

ఎన్నికల్లో పులివెందుల డివిజన్‌ బాధ్యతలను భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలకు సన్నిహితుడైన డి.శివశంకర్‌రెడ్డి చూశాడు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఆశించిన శివశంకర్‌రెడ్డికి టికెట్‌ ఇప్పించేందుకు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రయత్నించారు. టికెట్‌ దక్కకపోవడంతో ముగ్గురు వివేకాపై కక్ష పెంచుకున్నారు. అదే సమయంలో బెంగుళూరు సెటిల్‌మెంట్‌లో భంగపడిన గంగిరెడ్డి వారికి సహకారం అందించాడు.

2019ఎన్నికలలో వివేకా చురుగ్గా ఉండటంతో వీరి మధ్య రాజకీయ శత్రుత్వం పెరిగింది. కడప ఎంపీ సీటును షర్మిల, విజయమ్మల్లో ఒకరికి ఇచ్చి అవినాష్‌రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పించాలని వివేకా ప్రయత్నించారు. షర్మిలను కడప ఎంపీ బరిలో నిలపడానికి కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఈ విషయం ప్రజల్లోకి రావడంతో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు కుట్ర పన్నారు. సర్పంచి ఎన్నికల్లో శివశంకర్‌రెడ్డి కుటుంబానికి వివేకా మద్దతు ఇవ్వకపోవడంతో వివేకాపై పగ పెంచుకున్నారని సిబిఐ కౌంటర్‌లో వివరించింది.

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలక పాత్ర….

హత్య పథకాన్ని అమలు చేయడంలో సునీల్‌యాదవ్‌ కీలక పాత్ర పోషించాడని సిబిఐ చెబుతోంది. సంఘటనకు ముందు ఏడాదిన్నరగా వివేకాతో కలిసి ఉంటున్నా, హత్యకు ముందు సునీల్‌యాదవ్‌‌ను వివేకా దూరం పెట్టడంతో కక్ష పెంచు కున్నాడని వివరించింది.హత్య కుట్రలో భాగంగా రూ.40 కోట్లలో రూ.5 కోట్లు వాటా ఇస్తామని గంగిరెడ్డి ఆఫర్ ఇచ్చాడు.

వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డిల తరపున గంగిరెడ్డి డబ్బు తీసుకున్నాడు. దస్తగిరికి రూ.కోటి అందజేసిన సునీల్‌ యాదవ్‌ అందులో రూ.25 లక్షలు ఉంచుకుని తిరిగి ఇస్తానని చెప్పాడు. ఈ డబ్బుతో దస్తగిరి ఇల్లు కొనడానికి ప్రయత్నించినా అది నెరవేరలేదు. ఓ ఇంటిని కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందం అమలు కాకపోవడంతో తన వద్ద ఉన్న రూ.46 లక్షలను మిత్రుడు సయ్యద్‌ మున్నా వద్ద దాచాడు.

హత్య పథకం రూపొందించిన పది రోజుల ముందు సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలు వివేకా కుక్కను కారుతో ఢీకొట్టి చంపేశారు. 2019 మార్చి 12న వివేకా భార్య సౌభాగ్యమ్మ ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్‌ వెళ్లడాన్ని అదునుగా భావించి పథకాన్ని అమలు చేశారు. సునీల్‌యాదవ్‌ గొడ్డలి కావాలని అడగడంతో పులివెందులకు 35 కిలోమీటర్ల దూరంలోని కదిరికి వెళ్లి దస్తగిరి గొడ్డలి తీసుకొచ్చాడు. గొడ్డలి కొనుగోలు చేసిన దస్తగిరిని దుకాణం యజమాని గుర్తించాడు.

మాట మారుస్తున్న నిందితులు, సాక్ష్యులు….

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్‌రెడ్డికి సన్నిహితుడైన ఎస్‌.గంగాధర్‌రెడ్డి గత ఏడాది అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. సీఐ శంకరయ్య, ఎంవీ కృష్ణారెడ్డిలను కూడా హత్య చేసిన కుట్రదారులు ప్రభావితం చేశారు. చనిపోయిన గంగాధర్‌రెడ్డి సీబీఐని ఆశ్రయించి ఓసారి వాంగ్మూలం ఇచ్చారు.

హత్య నేరాన్ని తనపై వేసుకుంటే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు రూ.10 కోట్లు ఇస్తారని శివశంకర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చినట్లు సిబిఐకు వివరించాడు. ఇదే విషయాన్ని మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండగా సీబీఐ బెదిరిస్తోందని గంగాధర్‌రెడ్డి మీడియా ముందు ఆరోపించాడు. గత ఏడాది జూన్‌లో అతను అనుమానాస్పదంగా మృతి చెందాడు.

వివేకా మరణం గురించి తనకు ఎంపీ అవినాష్‌రెడ్డి చెప్పారని సీఐ శంకరయ్య సిబిఐకు వెల్లడించారు. శివశంకర్‌రెడ్డి బెదిరించినట్లు సీఐ మాకు వాంగ్మూలం ఇచ్చినా, తర్వాత మేజిస్ట్రేట్‌ ముందు అదే వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారని వివరించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పె‌ండ్ అయిన శంకరయ్య ఆ తర్వాత విధుల్లో చేరారు. ఉదయ్‌రెడ్డిని విచారణకు పిలిపించగా నెల తర్వాత సీబీఐపైనే ఫిర్యాదు చేశాడని సీబీఐ వివరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ తెలంగాణ హైకోర్టుకు సూచించింది.

IPL_Entry_Point