Anam Ramnarayana: టీడీపీ నుంచి పోటీ, క్లారిటీ ఇచ్చిన ఆనం రాంనారాయణ రెడ్డి
Anam Ramnarayana: వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తానని మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ప్రకటించారు. కొద్ది నెలల క్రితం వైసీపీ నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం, కోటం రెడ్డిలపై పార్టీ వేటు వేసింది. అప్పటి నుంచి మౌనంగా ఉంటుంన్న ఆనం మళ్లీ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ప్రకటించారు.

Anam Ramnarayana: వైసీపీ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి మౌనంగా ఉంటున్న మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయ ణరెడ్డి స్పష్టం చేశారు.
ఆనం ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. తాను ఎంపీ స్థానానికి పోటీ చేయనన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానన్నారు. మండల కేంద్రమైన వరికుంటపాడులో మాజీ ఏఎంసీ ఛైర్మన్ అండ్రా నాగిరెడ్డి నివాసంలో నాయకులతో ఆనం మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి జిల్లాలో అన్ని స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ఆఖరులో ముందస్తు ఎన్నికలు ఉండవచ్చని, ఎన్నికల ముందు 60 శాతం మంది తెదేపాలో చేరుతారని జోస్యం చెప్పారు. అధికారం ఉన్నందున కొంతమంది వారి పనుల దృష్ట్యా తాత్కాలికంగా వైకాపాలో ఉంటున్నారని, జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం ఉదయగిరి నియోజక వర్గం పరిస్థితులపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
జనవరిలో ఆనంపై వేటు…
నెల్లూరులో మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి వైసీపీ అధిష్టానం ఝలక్ గత జనవరిలో ఇచ్చింది. పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న రాంనారాయణ రెడ్డికి పొమ్మనకుండా పొగబెట్టేసింది. మొదట ఆనం భద్రత కుదించిన ప్రభుత్వం, తర్వాత గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం లేదని తేల్చేసింది. వైసీపీ వ్యవహార శైలిపై ఆనం కుతకుతలాడిపోయినా మౌనంగానే ఉండిపోయారు.
పార్టీలో ఉంటూనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటంతో ఆనం వ్యవహారానికి ముగింపు పలికేశారు. అదే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఉదయగిరి ఎమ్మల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా పార్టీకి అవసరం లేదని తేల్చేశారు. భద్రత కుదించడం, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే ఇన్‌ఛార్జిని నియమించి ఆనంను అవమానకరంగా బయటకు పంపేశారు.
ఆనం గత ఏడాది కాలంగా ప్రభుత్వ పనితీరుపై ఆనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని, అభివృద్ధిపై నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని గత ఏడాది వ్యాఖ్యలు చేశారు. ఇది వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. ఆనం పదేపదే అలాంటి వ్యాఖ్యలు చేస్తుండటంతో నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియోజక వర్గ ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. దీనిపై ఆనంకు కనీసం మాట మాత్రం కూడా సమాచారం ఇవ్వలేదు. పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని తేల్చేసినా ఆనం మౌనంగా ఉండిపోయారు.
మాజీ మంత్రిగా నెల్లూరు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన ఆనం రాం నారాయణ రెడ్డి, వైఎస్ మరణం తర్వాత ఓ దశలో ముఖ్యమంత్రి స్థానానికి కూడా పోటీ పడ్డారని ప్రచారం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నించిన వారిలో ఆనం కూడా ఉన్నారు. అవి ఫలించలేదు.
2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనం తన అనుచరులతో టీడీపీలో చేరారు. అక్కడ కూడా ఇమడలేకపోయారు. ఆనంకు టీడీపీలో సముచిత స్థానం దక్కుతుందని భావించి భంగ పడ్డారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు.
అనూహ్యంగా సీనియర్లను పక్కన పెట్టేసి జగన్ కొత్త వారితో జట్టు కట్టడంతో ఆనంకు మింగుడు పడలేదు. రెండున్నరేళ్ల తర్వాత అవకాశం లభిస్తుందనుకున్నా అదీ నెరవేరలేదు. ఎమ్మెల్యేగా ఉన్నా పనులు జరగకపోవడం, పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడం వంటి కారణాలతో ఆనం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అది కాస్త వికటించి ఆయన్ని బయటకు పంపే పరిస్థితులు వచ్చాయి. దీంతో మళ్లీ ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఆనం ఉన్నారు.