కేజీ టమాట ధర రూ. 80 నుంచి 100.. అన్ని కూరగాయల ధరలు పైపైకి-vegetable prices soar tomatoes reach rupees 80 to100 per kg ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కేజీ టమాట ధర రూ. 80 నుంచి 100.. అన్ని కూరగాయల ధరలు పైపైకి

కేజీ టమాట ధర రూ. 80 నుంచి 100.. అన్ని కూరగాయల ధరలు పైపైకి

HT Telugu Desk HT Telugu
Jun 24, 2024 06:58 AM IST

టమాట ధరలు కేజీ రూ. 80 నుంచి రూ. 100 మ‌ధ్య ప‌లుకుతుండడంతో సామాన్యుల ఖర్చులు అంచనాకు మించి పెరిగిపోతున్నాయి.

టమాట సరఫరా తగ్గడంతో రూ. 100 పలుకుతన్న కిలో ధర
టమాట సరఫరా తగ్గడంతో రూ. 100 పలుకుతన్న కిలో ధర (AP)

తెలుగు రాష్ట్రాల్లో ట‌మాట ధ‌రలు ఆకాశానికి ఎగ‌బాకాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఏ మార్కెట్ చూసిన కేజీ ట‌మోట ధ‌ర రూ. 80 నుంచి రూ.100 మధ్య ఉంది. ఏపీ, తెలంగాణ‌ల్లో ప్ర‌తి ఏడాది ఈ సీజ‌న్‌లో ట‌మోట పంట ఉండ‌దు. దీంతో క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల‌నుండి ట‌మోట‌ను దిగుమ‌తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సీజ‌న్‌లో ట‌మోట పండే రాష్ట్రాల్లో వ‌ర్షాలు ప‌డ‌టంతో పంట న‌ష్టం వాటెల్లింది. ఏపీలోని మ‌ద‌న‌ప‌ల్లె, ప‌ల‌మ‌నేరు నుంచి, క‌ర్ణాట‌క‌లోని చింతామ‌ణితో పాటు ఇత‌ర ప్రాంతాల నుంచి ట‌మోటాలు దిగుమ‌తి అవుతున్నాయి. అయితే మ‌ద‌న‌ప‌ల్లె మార్కెట్లో కూడా టమోట ధర కేజీ రూ. 60 నుంచి 70 మధ్య ఉంది.

yearly horoscope entry point

ఆయా రాష్ట్రాల నుంచి ట‌మాట పంట చేతికి రావ‌డం త‌గ్గింది. దానివ‌ల్ల మ‌న రాష్ట్రాల మార్కెట్ల‌కు ట‌మోట దిగుమతి త‌గ్గింది. దీంతో ట‌మోట ధ‌ర అమాంతం పెరిగింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రూ. 30 ఉన్న కేజీ ట‌మాట, వారంలోనే ఒక్క‌సారిగా రూ. 80 నుంచి రూ. 100కి పెరిగింది. మార్కెట్ల‌లో క‌నిపించే ట‌మాట కూడా నాసిరకంగా ఉంటోంది.

రైతు బజార్ల వద్ద క్యూలు

ఆంధ్ర ప్రదేశ్‌లో శ్రీ‌కాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు అన్ని జిల్లాల్లోని మార్కెట్ల‌లో ట‌మోట ధ‌ర భారీగా పెరిగింది. అయితే కొన్ని రైతు బజార్లో 55 నుంచి 65 మధ్య పలుకుతోంది. దీంతో జ‌నాలు రైతు బ‌జార్ల వ‌ద్ద క్యూలు క‌డుతున్నారు. కాగా అవసరమైనంత మేర టమోట దిగుమతి చేసుకొని, రైతు బజార్లో తక్కువ ధరకు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు తెలిపారు.

మ‌రోవైపు ఉల్లిపాయ‌లు, ఇతర కూర‌గాయ‌ల ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. గ‌తంలో ఉల్లిపాయ‌లు కేజీ ధ‌ర రూ. 20 ఉండ‌గా, ఇప్పుడు ఉల్లిపాయ‌ల ధ‌ర రూ. 50 నుంచి రూ. 60 మధ్య ఉంది. అయితే రైతు బ‌జార్లలో కేజీ ఉల్లి రూ. 40 నుంచి రూ. 50 మ‌ధ్య దొరుకుతోంది. అలాగే బీరకాయలు, బెండ కాయలు, గోరు చిక్కుుడ వంటి అన్ని కూరగాయల ధరలు పైపైకి వెళుతున్నాయి.

రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner