వివేకా హత్య కేసు నిందితుల ప్రాణాలకు అపాయం.. జైలర్‌ను మార్చండి: వర్ల రామయ్య-varla ramaiah wrote a letter to cbi director on ys viveka murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  వివేకా హత్య కేసు నిందితుల ప్రాణాలకు అపాయం.. జైలర్‌ను మార్చండి: వర్ల రామయ్య

వివేకా హత్య కేసు నిందితుల ప్రాణాలకు అపాయం.. జైలర్‌ను మార్చండి: వర్ల రామయ్య

HT Telugu Desk HT Telugu
Feb 15, 2022 08:58 AM IST

వైఎస్ వివేక హత్య కేసులో నిందితుల ప్రాణాల భద్రతా దృష్ట్యా తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఇందులో కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు.

<p>వర్ల రామయ్య&nbsp;</p>
వర్ల రామయ్య (Facebook)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివికానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వై.ఎస్ వివేకా హత్య కేసు నిందితుల ప్రాణాల భద్రత దృష్ట్యా కడప కేంద్ర కారగార జైలర్‌గా నియమితులైన పి. వరుణారెడ్డిని అక్కడ నుంచి బదిలీ చేయాలని కోరుతూ సిబిఐ డైరక్టర్‌కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. కొన్ని కీలక విషయాలను అందులో పొందుపరిచారు.

వర్ల రామయ్య లేఖలో ఏం పేర్కొన్నారంటే..

"2019 మార్చి 14, 15 అర్ధరాత్రి రాజకీయ ప్రముఖుడు, మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ శాసనసభ్యుడైన శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి కడప జిల్లా పులివెందుల పట్టణంలోని తన నివాసంలో గొడ్డలి, పదునైన ఆయుధాలతో దారుణంగా హత్య చేయగా, అక్కడికక్కడే మృతి చెందారు. నేరం జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన వ్యక్తులు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించి ప్రత్యేక క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది నిందితులను కూడా అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో సాక్ష్యాలను తారుమారు చేసి హత్యను ఆత్మహత్యగా, గుండెపోటుతో మరణించారని చూపేందుకు ప్రయత్నించారు.

•కానీ, మృతుడు తలకు అనేక గాయాలు, రక్తపు మడుగులో కనిపించడంతో హత్య కేసు నమోదు చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును ఈ నేరంలో ఇరికించేందుకు ప్రయత్నించారు. ఈ కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని బహిరంగ ప్రెస్‌మీట్‌లో సైతం డిమాండ్‌ చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు విశ్వాసం లేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మృతుడి భార్య, అయన కుమార్తె కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆశ్చర్యకరంగా, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తనకు బాగా తెలిసిన కారణాలతో హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి హత్య కేసు విచారణపై మౌనంగా ఉన్నారు. హైకోర్టు ఇరువర్గాలను పరిశీలించి, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును పరిశీలించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం తప్ప దర్యాప్తులో పురోగతి లేదని భావించి వివేకానంద రెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం సీబీఐ దర్యాప్తును తిరిగి చేపట్టింది.

ఇందులో భాగంగా సీబీఐ 2021 జూలై 6వ తేదీన వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని అరెస్టు చేసింది. అతను తరువాత అప్రూవర్‌గా మారాడు. మృతుడి హత్యలో పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డితో సహా నలుగురు వ్యక్తులు ప్రమేయం ఉందని దస్తగిరి నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు. మృతుడిని చంపేందుకు నలభై కోట్ల రూపాయల సుపారీ తీసుకున్నారని, అందులో తనకు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నానని కూడా అంగీకరించాడు.

ఈ నేపథ్యంలో నేను ఈ విషయాలను సీబీఐ డైరెక్టర్ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా ఉన్న వరుణారెడ్డి గతంలో దివంగత పరిటాల రవీంద్ర రాజకీయ హత్యకేసులో నిందితులుగా ఉంచిన అనంతపురం జిల్లా జైలు జైలర్‌గా పని చేసి ఉన్నారు.

2008 నవంబర్ 11వ తేదీ రాత్రి ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను తన జైలు గదిలోనే సహ నిందితుడి చేతిలో సిమెంట్ డంబ్ బెల్ తో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో అప్పటి అనంతపురం జిల్లా జైలు జైలర్ వరుణారెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. వరుణారెడ్డి తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, డంబెల్‌ను జైలు బ్యారక్‌లోకి అనుమతించినందుకు, పర్యవేక్షణలో అలసత్వం వహించినందుకు సస్పెండ్ చేశారు. అదేవిధంగా వరుణా రెడ్డి తాను పనిచేసిన చాలా చోట్ల తన న్యాయబద్ధమైన విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. అయితే ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో అతనిని నియమించడంతో అతడి పూర్వాపరాల గురించి తెలిసిన అనేక మంది విస్మయం చెందుతున్నారు.

•ప‌రిటాల ర‌వీంద్ర హ‌త్య‌లో ప్ర‌ధాన నిందితుడు హ‌త్య‌కు గుర‌వుతున్న‌ప్పుడు పి. వరుణారెడ్డి అనంతపురం జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. పరిటాల రవి కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శీను, వరుణారెడ్డి అనంతపురం జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా ఉండగా జైలులోనే చంపబడ్డాడు. గతంలో వరుణారెడ్డి జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో అనంతపురం జైలులో జరిగిన సంఘటనల తరహాలోనే కడప కేంద్ర కారాగారంలో కూడా జరిగే అవకాశం ఉందని చాలా ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి..

- వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ప్రాణాలకు రక్షణ కల్పించే దృష్ట్యా వారిని కడప కేంద్ర కారాగారం నుంచి రాజమండ్రికి మార్చండి

- వివేకానంద రెడ్డి హత్యలో కడప సెంట్రల్ జైలులో ఉన్న నిందితుల భద్రత దృష్ట్యా వరుణారెడ్డిని కడప జైలు నుంచి ట్రాన్స్ ఫర్ చేయండి.

- వివేకానంద రెడ్డి హత్యకేసులో ఇప్పటి వరకు సీబీఐ చేసిన దర్యాప్తును సమీక్షించండి. ఎందుకంటే, దస్తగిరి నేరాంగీకార పత్రం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ వివేక హత్య కేసుకు సంబంధించి ముఖ్యమైన నిందితులను సీబీఐ కూడా ఏమీ చేయలేదనే భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు." అని తన లేఖలో ప్రస్తావించారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం