Tirumala Srivari Mettu : శ్రీవారి మెట్టు నడకదారిలో మినీ అన్నదాన కాంప్లెక్స్ ..-ttd chairman yv subbareddy orders officials to start mini annadana complex at srivari mettu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Srivari Mettu : శ్రీవారి మెట్టు నడకదారిలో మినీ అన్నదాన కాంప్లెక్స్ ..

Tirumala Srivari Mettu : శ్రీవారి మెట్టు నడకదారిలో మినీ అన్నదాన కాంప్లెక్స్ ..

HT Telugu Desk HT Telugu
Jan 16, 2023 02:55 PM IST

Tirumala Srivari Mettu : తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో వచ్చే భక్తుల కోసం ఎంబీసీ ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఈ మేరకు స్థలాన్ని పరిశీలించిన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Tirumala Srivari Mettu : శ్రీవారి మెట్టు నడకదారిలో భక్తులకు త్వరలో అన్నదాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఎంబీసీ ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి 16న అధికారులతో కలసి శ్రీవారి మెట్టునుంచి భక్తులు తిరుమలకు చేరుకునే ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నడచి వచ్చిన పలువురు భక్తులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి భూమి చదును చేయాలని, తగిన వసతులు ఏర్పాటు చేసి భక్తులకు అన్నప్రసాదం అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఆర్సీసీ సెంటర్లోని నివాస గృహాలనూ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఆరాధన కేంద్రం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆరాధన కేంద్రం నిర్మాణ ప్రాంతంలో ఇంకా మిగిలిఉన్న ఇళ్ళను తొలగించి పార్కింగ్ ప్రాంతంగా తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఆరాధన కేంద్రం నిర్మాణ డిజెన్లు త్వరగా ఖరారు చేసి టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అంతకముందు.. కనుమ పండుగ సందర్బంగా తిరుమలలోని గోశాలలో నిర్వహించిన గోపూజలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. గోమాతకు పూలు, పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. ఎస్టేట్ విభాగం ఒఎస్డీ మల్లిఖార్జున, వీజీవో బాలిరెడ్డి, ఇతర అధికారులు పూజలో పాల్గొన్నారు.

తిరుమలలో భక్తులకు కేటాయించే వసతి గదుల అద్దెల్ని భారీగా పెంచారనే విమర్శల్ని టీటీడీ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ సామాన్య భక్తులకు సౌకర్యాలను కల్పించడానికి పెద్ద పీట వేస్తోందని, సామాన్య భక్తులు పొందే గదుల అద్దె పెంచలేదని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల రూ.120 కోట్లతో రూ.50/- రూ.100/- అద్దె గదుల ఆధునీకరణ పనులు చేపట్టామని, మరో రూ.100 కోట్లతో పిఏసి-5 నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు. విఐపిలు బస చేసే గదుల్లో అద్దె వ్యత్యాసం లేకుండా చేశామని చెప్పారు. టీటీడీపై దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని కోరారు. తిరుమలలో మొత్తం 7500 గదులు ఉన్నాయని, వీటిలో సామాన్య భక్తుల కోసం రూ.50/-, రూ.100/- అద్దెగల గదులు సుమారు 5 వేల వరకు ఉన్నాయని వివరించారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం ఏడుకొండల వాడిని 76,307 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.41 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

IPL_Entry_Point