Tirumala Temple | శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రోజు ఆ 1000 మందికి ప్రత్యేక దర్శనం
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలపై నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. వారికి దర్శనాలు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.
కరోనా వైరస్ కారణంగా తిరుమలలో చాలా రకాల సేవలు నిలిపోయాయి. అయితే ఇప్పుడు వైరస్ తగ్గుముఖం పట్టడంతో క్రమక్రమంగా సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తుంది. రెండేళ్లుగా వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనాలు నిలిపివేసింది. తాజాగా మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు టీటీడీ పేర్కొంది.
ఈ మేరకు వికలాంగులు, వృద్ధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్టు స్పష్టం చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రోజుకు 1,000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు దర్శనం ఉండనుంది.
కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తుల సంఖ్యను పెంచాలని టీటీడీ భావిస్తోంది. రెండు సంవత్సరాలుగా.. వికలాంగులు, వయోవృద్దులకు జారీ చేసే దర్శన విధానంలో నిర్ణయం తీసుకుంది. కరోనా కంటే ముందు వరకూ తిరుమలలోని మ్యూజియం వద్ద ఉన్న కౌంటర్ లో ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు 750 టోకెన్లను వయోవృద్దులకు, వికలాంగులకు కేటాయించేవారు. కరోనాతో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ వారికి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. టీటీడీ అధికారులకు విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారికి దర్శనాలను పునరుద్దరించనున్నారు. రోజుకి 1000 టిక్కెట్ల చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. అయితే వికలాంగులు, వృద్ధులకు అందజేసే టోకెన్ల జారీ ప్రక్రియను తిరుమలలో జారీ చేస్తారా? తిరుపతిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారా? లేదంటే.. ఆన్లైన్ ద్వారా టికెట్లు ఇస్తారా అనేది తెలియాలి.
మరోవైపు శ్రీవారి దర్శనాలు పునః ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే కల్యాణోత్సవ సేవను మాత్రం వర్చువల్ గానే ప్రారంభించింది టీటీడీ. భక్తుల నుంచి వర్చువల్ సేవకే ఎక్కువగా స్పందన వచ్చింది. దీంతో ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను వర్చువల్ గానే ప్రారంభించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత, నిత్య సేవలలో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ.