Supreme Court | నిందితుడి బెయిల్ మంజూరుకు ఆదేశాలిచ్చి 19 నెలలైంది.. ఎందుకీ ఆలస్యం
న్యూఢిల్లీ: హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి 2020లో బెయిల్ మంజూరుకు ఆదేశాలిచ్చినా.. ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏపీలోని ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
వరకట్న వేధింపులు, హత్య కేసులో దోషిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి గోపిశెట్టి హరికృష్ణకు 2020 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలున్నా.. ఒకటిన్నర సంవత్సరాలకు పైగా గోపిశెట్టి హరికృష్ణను బెయిల్‌పై విడుదల చేయడానికి, షరతులను నిర్ణయించడానికి ట్రయల్ కోర్టు విచారణకు తీసుకోలేదు. దీంతో నిందితుడు జైలు శిక్ష అనుభవిస్తున్న నెల్లూరు జైలు సూపరింటెండెంట్, ఆయన బెయిల్ పిటిషన్‌ను విచారణకు తిరస్కరించిన ట్రయల్ కోర్టు జాప్యంపై సుప్రీం కోర్టు వివరణ కోరింది.
తప్పు చేసిన జైలు అధికారులపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. 2015లో ట్రయల్ కోర్టు ప్రకటించిన నేరాన్ని, జీవిత ఖైదును సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019 నాటి ఉత్తర్వులపై హరికృష్ణ సుప్రీం కోర్టుకు వెళ్లాడు. ఈ అప్పీల్ ను విచారిస్తున్న సమయంలోనే.. సుప్రీం కోర్టు సెప్టెంబర్ 2020 బెయిల్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
ఆ తర్వాత సెప్టెంబరు 2020 నుంచి.. హరికృష్ణ కేసు ఐదుసార్లు సుప్రీం కోర్టుకు వచ్చినా.. విచారణ జరగలేదు. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్ 13న మాత్రమే అతని వాదనను స్వీకరించడానికి కోర్టు అంగీకరించింది. దీంతో సుప్రీం కోర్టు ట్రయల్ కోర్టును ప్రశ్నించింది. బెయిల్ మంజూరుపై జాప్యం ఎందుకు జరిగిందని వివరణ కోరింది. ఏప్రిల్ 20న హరికృష్ణను బెయిల్ పై విడుదల చేశారు.
సెప్టెంబర్ 2020లో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ.. నిందితుడిని మూడు రోజుల్లోగా ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే, నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచకపోవడంతో ట్రయల్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయలేదు. నిందితుడు మే 2011 నుండి కస్టడీలో ఉన్నాడు. అతడు చేసిన నేరానికి 9 సంవత్సరాలకు పైగా జైలు శిక్షను పూర్తి చేశాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హరికృష్ణను ట్రయల్ కోర్టు ముందు ఎందుకు హాజరుపరచలేదో కూడా నెల్లూరు జైలు సూపరింటెండెంట్‌ను వివరణ కోరింది.
అయితే వాదనల సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది కోర్టు ఆదేశాలను అనుసరించి వివరించే ప్రయత్నం చేశారు. కొవిడ్ ఆంక్షల కారణంగా 2020లో హరికృష్ణను కోర్టులో హాజరు పరచలేమని జైలు అధికారులు చెప్పినట్టుగా తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. కొవిడ్ సమయంలో ఎవరిని విడుదల చేయకూడదని మీరే సూచిస్తున్నారా? ఆ సమయంలో, మేం అనేక మంది అండర్ ట్రయల్/ఖైదీలకు (జైళ్ల రద్దీని తగ్గించడానికి) బెయిల్ ఇచ్చాము. ఏదైనప్పటికీ అతడిని విడుదల చేసి ఉండాలి.. అని వ్యాఖ్యానించింది.
సంబంధిత కథనం
టాపిక్