Guntur Crime: మంగళగిరిలో మాయగాళ్లు.. 24గంటల్లో ముగ్గురు బాలికలపై లైంగిక దాడులు, నిందితులపై పోక్సో కేసుల నమోదు-sexual assaults on three guntur girls in 24 hours pocso cases registered against the accused ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Crime: మంగళగిరిలో మాయగాళ్లు.. 24గంటల్లో ముగ్గురు బాలికలపై లైంగిక దాడులు, నిందితులపై పోక్సో కేసుల నమోదు

Guntur Crime: మంగళగిరిలో మాయగాళ్లు.. 24గంటల్లో ముగ్గురు బాలికలపై లైంగిక దాడులు, నిందితులపై పోక్సో కేసుల నమోదు

HT Telugu Desk HT Telugu

Guntur Crime: గుంటూరు జిల్లాలో ఒకే రోజు ముగ్గురు బాలికలపై లైంగిక దాడులు జరిగాయి. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలించి అదుపులోకి తీసుకున్నారు.

మంగళగిరిలో బాలికలపై లైంగిక దాడులు

Guntur Crime: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం, రూరల్ పరిధిలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు బాలికలపై లైంగిక దాడులు వెలుగు చూశాయి. 24 గంటల వ్యవధిలో మంగళగిరి రత్నాల చెరువు, బాలాజీ నగర్‌, పెదకాకానిలో ముగ్గురు బాలికలపై అత్యాచార యత్నాలు జరిగాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.‌ శనివారం రాత్రి నిందితులను పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.‌

నిద్రిస్తున్న బాలికపై...

గడిచిన 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అత్యాచార యత్నం చేయగా బాధితుల ఫిర్యాదుతో వారిపై మంగళగిరి పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలు ఆదివారం పోలీసులు వెల్లడించారు.

మంగళగిరి నగర పరిధిలోని రత్నాలచెరువు బిఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల గుంటూరు వెంకటేశ్వరరావు అత్యాచారయత్నం చేశాడు. శుక్రవారం ఉదయం మైనర్ బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఒంటరిగా నిద్రపోతున్న మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నిందితుడి చేష్టలతో మేలుకొన్న బాలిక బిగ్గరగా అరిచి ఆ వ్యక్తిని ప్రతిఘటించి బయటకు పరిగెత్తింది.

పక్కింటి వారికి విషయం చెప్పడంతో వారు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఆ వ్యక్తిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

ఒంటరిగా ఉన్న బాలికపై

మంగళగిరి నగర పరిధిలోని బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్న ఏడేళ్ళ బాలికతో వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఒంటిరిగా ఉన్న బాలికతో అదే ప్రాంతానికి చెందిన వండ్రంగి పని చేసుకునే 60 ఏళ్ల చింతక్రింది వెంకటేశ్వరరావు అసభ్యకరంగా ప్రవర్తించే సమయంలో బాలిక తల్లిదండ్రులు రావటంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

ద్విచక్ర వాహనంపై బలవంతంగా ఎత్తుకెళ్లి...

పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన గాడిదపాటి రాజు అనే వ్యక్తి అపార్ట్మెంట్ లకు వాచ్ మెన్ గా పనిచేస్తూన్నాడు. రాజు కుమార్తె నంబూరులో 5వ తరగతి చదువుతుంది. గతంలో మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఒక అపార్ట్మెంట్ కు వాచ్ మెన్ గా పనిచేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన తాటి రూపేంద్ర ప్రభు బాలిక వెంటపడి ప్రేమించమని ఇబ్బందులకు గురిచేశాడు. మైనర్ బాలిక తండ్రి ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని హెచ్చరించారు.

రెండు రోజులు క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికను ద్విచక్ర వాహనంపై బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేసినట్లు బాలిక తండ్రి రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసుని దర్యాప్తు చేసిన పోలీసులు రూపేంద్రని అరెస్టు చేసి అతనిపై కిడ్నాప్ కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కి పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. రూపేంద్రపై గతంలో గంజాయి, లిక్కర్ కేసులు ఉన్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)