Palnadu Road Accident : పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం, వరంగల్ డ్యాన్సర్ మృతి!-palnadu road accident warangal dancer ashwini died on spot ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Palnadu Road Accident : పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం, వరంగల్ డ్యాన్సర్ మృతి!

Palnadu Road Accident : పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం, వరంగల్ డ్యాన్సర్ మృతి!

Bandaru Satyaprasad HT Telugu
Sep 27, 2023 01:56 PM IST

Palnadu Road Accident : వరంగల్ కు చెందిన డ్యాన్సర్ అశ్విని పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. రొంపిచర్లలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

వరంగల్ డ్యాన్సర్ అశ్విని
వరంగల్ డ్యాన్సర్ అశ్విని

Palnadu Road Accident : పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ డ్యాన్సర్ ఎం.అశ్విని(20) మృతి చెందింది. యువతి ప్రయాణిస్తున్న బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్‌ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్యాన్సర్ అశ్వినితో పాటు బైక్ ఉన్న మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలో వీరిద్దరూ ప్రయాణిస్తు్న్న బైక్ కు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి రొంపిచర్లలో వినాయక నిమజ్జనం కార్యక్రమంలో నరసరావుపేటకి చెందిన సోనీ ఈవెంట్స్‌ డ్యాన్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో నర్సంపేటకు చెందిన ఎం.అశ్విని డ్యాన్స్ చేసేందుకు వచ్చింది.

yearly horoscope entry point

సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టి

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అశ్విని వరంగల్ కు చెందిన మున్నా అనే యువకుడి బైక్ పై తిరుగుప్రయాణం అయింది. ఈ క్రమంలో తుంగపాడు వద్దకు రాగానే వీరి బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్‌ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టింది. బైక్ వెనుక కూర్చొన్న అశ్విని రోడ్డు పక్కన కాలువలో పడి తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడిపిన మున్నాకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడ్ని కూడా ఆసుపత్రికి తరలించారు. యువతి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-మైసూరు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మృతి చెందారు. బస్టాండ్‌ వద్ద ఆగి ఉన్న బస్సును వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మృతుల్లో ఒక యువతి, ముగ్గురు యువకులు ఉన్నారు. వీరంతా బెంగళూరుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

Whats_app_banner